త్వరలోనే భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. విమానాశ్రయానికి అన్ని అడ్డంకులు తొలగినట్లు చెప్పారు మంత్రి.
విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించ తలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి అన్ని అడ్డంకులు తొలగినట్లు చెప్పారు మంత్రి బొత్స సత్యనారాయణ. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. ఇదే సమయంలో ఎయిర్‌పోర్ట్‌కు మోడీ శంకుస్థాపన చేస్తారంటూ వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి కావాల్సిన భూసేకరణపైనా అధికార యంత్రాంగంతో సమీక్షిస్తున్నట్లు బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
అంతకుముందు మంగళవారం బొత్స మీడియాతో మాట్లాడారు. అడ్డంకులను అధిగమించి త్వరలోనే విశాఖపట్టణం రాజధానిగా మారనుందన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష సాకారమైనట్టేనని బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. అమరావతి రైతుల పాదయాత్ర ఇక కొనసాగదన్నారు. అమరావతి రైతుల పాదయాత్ర వెనుక టీడీపీ ఉందని.. దీనిని రైతులు నిలిపివేయడంతో ఈ యాత్ర వెనుక టీడీపీ ఉందని తేలిపోయిందని మంత్రి ఆరోపించారు. పాదయాత్రలో 60 మంది రైతులు కూడాలేరని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.
Also REad:అమరావతి రైతుల పాదయాత్ర వస్తుంటే.. బంద్ నిర్వహించాలి : మంత్రి బొత్స వ్యాఖ్యలు
ఇకపోతే.. అమరావతి పాదయాత్రలో 600 మంది కంటే ఎక్కువ మంది పాల్గొనవద్దని ఏపీ హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. పాదయాత్రకు మద్ధతిచ్చేవారంతా రోడ్డుకు ఇరువైపులా ఉండాలని హైకోర్టు ఆదేశించింది. అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో అమరావతి నుండి అరసవెల్లి వరకు రైతులు పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నిబంధనలకు విరుద్దంగా పాదయాత్ర నిర్వహిస్తున్నారని దాఖలైన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు విచారించింది. ఈ విషయమై ఇరు వర్గాల వాదనలను హైకోర్టు పరిగణనలోనికి తీసుకుంది. పాదయాత్రలో 600 మంది మాత్రమే పాల్గొనాలని .. పాదయాత్రకు సంఘీభావం ప్రకటించేవారు రోడ్డుకు ఇరువైపులా ఉండాలని సూచించింది. అలాగే పాదయాత్రలో నాలుగు వాహనాలకు మాత్రమే హైకోర్టు అనుమతిని ఇచ్చింది. పాదయాత్ర ప్రశాంతంగా జరిగేలా చూడాలని పోలీసు శాఖను ఆదేశించింది.
