ముద్రగడతో వైసీపీ ప్లాన్ ఇదేనా? పవన్ కళ్యాణ్ విసుర్లు అందుకేనా?
కాపు సామాజిక పెద్దలు ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్య కొడుకు వైసీపీ వైపు మళ్లారు. నిన్నా మొన్నటి వరకు వీళ్లు పవన్ కళ్యాణ్‌కు అండగా నిలిచారు. కానీ, టీడీపీతో సీట్ల పంపకాల అంశం తర్వాత వీరిద్దరూ జనసేనకు దూరమయ్యారు. తాజాగా, వీరిద్దరిపై పవన్ కళ్యాణ్ విసుర్లు సంధించారు.
పవన్ కళ్యాణ్‌కు మొన్నటి వరకు కాపు సామాజిక వర్గ పెద్దలు చేగొండి హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం సూచనలు చేశారు. ముఖ్యంగా హరిరామ జోగయ్య పలుమార్లు లేఖలు రాసి మరీ సూచనలు చేశారు. టీడీపీతో సీట్ల పంపకాల విషయంలోనూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాతే హరిరామ జోగయ్య తనయుడు జనసేన నుంచి వైసీపీలోకి వెళ్లారు. ముద్రగడ పద్మనాభం కూడా జనసేన నుంచి దూరంగా జరిగారు. నిన్న వైసీపీలో చేరడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ విషయం గురించి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. ముద్రగడకు ప్రత్యేకమైన ఆఫర్ ఏమీ ఇవ్వలేదని పేర్కొన్నారు. ఆఫర్‌లు చూసి వచ్చే వ్యక్తి కాదు అని అన్నారు. అయితే.. పిఠాపురం నుంచి ఆయన పోటీ చేయడానికి అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఆయనపై పోటీగా ముద్రగడను నిలబెట్టాలని వైసీపీ ప్లాన్ వేసినట్టు సమాచారం. అంతేకాదు, జనసేన పోటీ చేసే.. అదీ ముఖ్యంగా కాపు సామాజిక వర్గ ఓట్లను ఆధారం చేసుకున్న స్థానాల్లో ముద్రగడతో వైసీపీ తరఫున బలంగా ప్రచారం చేయించాలనే ఆలోచనలు చేసినట్టు సమాచారం.
Also Read: రేపు బెంగళూరుకు ఉపరాష్ట్రపతి.. ట్రాఫిక్ సూచనలు ఇవే
కాగా, ఈ రోజు పవన్ కళ్యాణ్ ఓ సమావేశంలో మాట్లాడుతూ వీరిపై విమర్శలు చేశారు. నిన్నా.. మొన్నటి వరకు వాళ్లు తనకు సలహాలు ఇచ్చారని, ఎలా నిలబడాలి? ఎలా చేయాలో సూచనలు చేశారని పరోక్షంగా ముద్రగడ, హరిరామజోగయ్యపై పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. అయితే.. పవన్ కళ్యాణ్ దగ్గరే వారికి ఈ ఐడియాలు వస్తాయని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. తనకు సలహాలు ఇచ్చిన వారు ఇప్పుడు వైసీపీలో చేరారని విసుర్లు సంధించారు. సీట్లు ఇవ్వడం తెలియదా నాకూ..అంటూ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా దాదాపు కాపు సామాజిక వర్గ పెద్దలను టార్గెట్ చేసుకున్నారు. ఒక వేళ ముద్రగడ లేదా ఆయన కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ పై పోటీకి నిలబడినా.. ఆయన ఘాటు వ్యాఖ్యలతో ఎదుర్కొనే అవకాశం ఉన్నది. అయితే.. వైసీపీ అనుకున్నట్టుగా కాపు సామాజిక ఓట్లు మాత్రం చీలిపోయే అవకాశాలు మెండుగా ఉంటాయి.