భర్తను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న మహిళపై అధికార పార్టీ ఎంపిటిసి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన నంద్యాల జిల్లాలో వెలుగుచూసింది. 

నంద్యాల : వితంతు మహిళతో అధికార వైసిపి ఎంపిటీసి అసభ్యంగా ప్రవర్తించాడు. భర్త చనిపోయి ఒంటరిగా వుంటున్న మహిళపై ఎంపిటిసి కన్నేసాడు. ఫుల్లుగా మద్యం సేవించి ఆ మత్తులోనే బట్టలు లేకుండా మహిళ ఇంట్లోకి చొరబడ్డాడు. నిద్రిస్తున్న ఆమెపై అఘాయిత్యానికి యత్నించడమే కాదు ఎదురించడంతో దాడికి దిగాడు. ఎలాగోలా అతడి నుండి తప్పించుకున్న మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. 

బాధిత మహిళ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నంద్యాల జిల్లా అవుకు మండలం నిచ్చెనమెట్ల గ్రామానికి చెందిన మహిళ(38) భర్త కొన్నేళ్లక్రితమే మృతిచెందాడు. దీంతో పదేళ్ల కొడుకుకు అన్నీ తానేఅయి పోషించుకుంటోంది ఆ తల్లి. అయితే భర్తలేని ఆమెపై అన్నవరం ఎంపిటిసి గోపాల్ రెడ్డి కన్నేసాడు. చాలాసార్లు ఆమెను అసభ్యకర మాటలు, చేష్టలతో ఇబ్బందిపెట్టిన అతడు తాజాగా ఇంట్లోకే చొరబడి చాలా నీచంగా ప్రవర్తించాడు. 

శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో మహిళ ఒంటరిగా వుండటం ఎంపిటిసి గమనించాడు. అప్పటికే ఫుల్లుగా మద్యం సేవించి మత్తులో వున్న అతడు బట్టలు విప్పేసి అర్ధనగ్నంగా ఇంట్లోకి చొరబడ్డాడు. నిద్రిస్తున్న ఆమెతో అసభ్యంగా ప్రవర్తించగా మెలకువ వచ్చింది. దీంతో అతడిని ఎదిరించి గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు ఇళ్లవారు వచ్చారు. అందరినుండి తప్పించుకున్న గోపాల్ రెడ్డి అక్కడినుండి పరారయ్యాడు. 

Read More హైదరాబాద్ : సుతిమెత్తగా మసాజ్ చేస్తూనే ఒంటిపై బంగారం దోచేసారట..!

తనపై అఘాయిత్యానికి యత్నించిన వైసిపి ఎంపిటిసిపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిపై 448, 354, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. అయితే గోపాల్ రెడ్డి అధికార పార్టీ నాయకుడు మాత్రమే కాదు ఉమ్మడి కర్నూల్ జిల్లా ఎంపిటిసి సంఘం అధ్యక్షుడు కూడా... రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని స్టేషన్ బెయిల్ పొందాడని బాధితురాలు తెలిపింది. కానీ తనతో అసభ్యంగా ప్రవర్తించిన అతడికి శిక్ష పడేవరకు పోరాడతానని బాధిత మహిళ తెలిపింది.