వైసీపీ అధికారంలోకి వస్తే విద్యావిధానంలో పక్కాగా వ్యవహరిస్తామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. బంగారం తరలింపు వ్యవహారంపై టీటీడీ ఈవో వివరణపై విజయసాయి అనుమానాలు వ్యక్తం చేశారు.

టీడీపీ హయాంలో దేవాలయాలకు రక్షణ లేదన్నారు. అలాగే ఈవీఎంలను రష్యన్లు హ్యాక్ చేశారన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఐటీ గ్రిడ్స్‌లో ప్రజల సమాచారాన్ని లాగినట్టునుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు.

ఈవీఎంలపై చంద్రబాబు దేశవ్యాప్త ఉద్యమం బెడిసికొట్టిందన్నారు. తెలుగుదేశం పార్టీ 40 సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదని విజయసాయి ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ సహకారంతో లక్ష కోట్లు.. లక్షకోట్లు అంటూ ప్రచారం చేశారని ధ్వజమెత్తారు.

తాము ఎటువంటి వాణిజ్య లావాదేవీలు చేసినా చట్ట పరిధిలోనే నిర్వహించామని తమపై పెట్టిన కేసులన్నీ దొంగ కేసులేనని ఆయన అన్నారు. స్టాక్ బ్రోకర్‌ని స్టాక్ బ్రోకరే అని అంటారని కుటుంబరావుని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ఆర్ధిక మంత్రి ఒకటి చెబితే.. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మరోకటి చెబుతారని విజయసాయి ఆరోపించారు. ప్రజావేదికను పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించడం తప్పని, ఆ విషయాన్నే తాము ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామని స్పష్టం చేశారు. తెలంగాణ ఇంటర్ ఫలితాలు అక్కడి ప్రభుత్వానికి సంబంధించిన విషయమన్నారు.