Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుది అంతా ‘పీకుడు’ రాజకీయం.. వైఎస్ ది పెట్టుడు రాజకీయం

చంద్రబాబుపై వైసీపీ ఎంపీ సీరియస్ కామెంట్స్

ycp mp vara prsad serious comments on ap cm chandrababu naidu

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిది అంతా పీకుడు ప్రభుత్వమని వైసీపీ ఎంపీ వరప్రసాద్ అన్నారు. శుక్రవారం  మీడియా సమావేశంలో మాట్లాడిన ఎంపీ.. చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబుది పీకుడు ప్రభుత్వమైతే.. వైఎస్ ఆర్ ది పెట్టుడు ప్రభుత్వమని ఆయన అన్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. గురువారం కర్నూలు పర్యటనకి వెళ్లిన చంద్రబాబు.. అక్కడ ఓ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో అక్కడ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ప్రతిపక్ష పార్టీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఏమి పీకారు అని ప్రశ్నించారు.  కాగా.. వైసీపీ ఇప్పటి వరకు అధికారంలోకి రానే లేద అంటూ ఆ పార్టీ నేతలు ఎదురు దాడికి దిగారు. అయితే.. చంద్రబాబు అక్కడ జగన్ ని ఉద్దేశించి కాదని, ఆయన తండ్రి మాజీ సీఎం వైఎస్ఆర్ గురించి అలాంటి వ్యాఖ్యలు చేశారని మరికొందరు నేతలు అభిప్రాయడుతున్నారు.

కాగా.. చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ వర ప్రసాద్ స్పందించారు.  ముఖ్యమంత్రి వినియోగించిన ‘పీకుడు’  పదాన్ని పాజిటివ్‌గా తీసుకుంటే, పీకేవాళ్లెవరో, పెట్టేవాళ్లెవరో ఇట్టే తేల్చయవచ్చని చెప్పారు.  చంద్రబాబు సంబోధించింది మహానేత వైఎస్సార్‌నా, లేక వైఎస్‌ జగన్‌నా తెలియకున్నా తాను మాత్రం సమాధానం చెబుతానని వరప్రసాద్‌ అన్నారు. జగన్‌ ఇంకా అధికారం చేపట్టలేదన్న సంగతి గుర్తుచేసిన ఆయన.. టీడీపీది పీకే రాజకీయమైతే.. వైఎస్సార్‌సీపీది పెట్టే రాజకీయమని స్పష్టం చేశారు.


‘‘గడిచిన నాలుగేళ్లలో చంద్రబాబు నాయుడు 10 లక్షల పెన్షన్లను పీకేశారు. వృధాప్య పెన్షన్‌ వయసును 60 నుంచి 65 సంవత్సరాలకు పెంచి పెన్షన్లు పీకేశారు.దాదాపు 10 లక్షల మంది పేదల రేషన్‌ కార్డుల్ని పీకేశారు. 2 లక్షల మంది కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను విధుల నుంచి పీకేసిన ఘటన బాబుదే. తాను సీఎంగా ఉన్న కాలంలో 60కిపైగా ప్రభుత్వ సంస్థలను పీకేశారు.. అంటే మూసేశారు. నాడు గొప్పగా అమలైన ఉచిత విద్యుత్‌ పథకాన్ని పీకేశారు. జన్మభూమి కమిటీల పేరుతో దుర్మార్గపు కమిటీలను వేసి జనాన్ని పీక్కుతింటున్నారు. మీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగానీ, కలెక్టర్‌గానీ పేదలకు ఇల్లో, ఇంకేదో సాయం చేసే స్థితిలోలేరు.. ఎందుకంటే వాళ్ల అధికారాలన్నీ మీరు పీకేశారు.. వాటిని జన్మభూమి కమిటీల చేతుల్లో పెట్టారు. ఇంత అహంకారంతో మాట్లాడే మిమ్మల్ని ప్రజలే పీకేసే రోజు వస్తుంది.’’ అని అన్నారు.


ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ రాష్ట్ర ప్రజలకు ఏ ముఖ్యమంత్రైనా మంచి చేశారంటే అది ఒక్క వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిగారు మాత్రమే.ఆయన పేదల కోసం ఆరోగ్యశ్రీని పెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకులాల పేద పిల్లల చదువుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని పెట్టారు. డ్వాక్రా మహిళలకు పావల వడ్డీ పథకం పెట్టి వారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. 2004-2008 మధ్య కాలంలో అంబులెన్స్‌లు, మందుల సరఫరా ఎలా జరిగిందో ప్రజలకు గుర్తుంది. నా నియోజకవర్గం(తిరుపతి పార్లమెంట్‌ పరిధి)లో మూడు ఎస్‌ఈజెడ్‌లు పెట్టారు. తద్వారా వందలాది పరిశ్రమలు, వేల మందికి ఉపాధి కల్పించారు.’’ అని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios