నా భార్య అడుగుతోంది... ఏం చెప్పమంటావు, లోకేష్!..: ఎమ్మెల్యే సుధాకర్ బాబు
నారా లోకేష్ తనపై చేసిన ఆరోపణల వల్ల ఇంట్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని సంతనూతలపాడు వైసిపి ఎమ్మెల్యే సుధాకర్ బాబు తెలిపారు.

ఒంగోలు : తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ తనపై చేసిన అవినీతి, అక్రమ ఆస్తుల ఆరోపణలపై అధికార వైసిపి ఎమ్మెల్యే సుధాకర్ బాబు స్పందించారు. లోకేష్ ఆరోపణల వల్ల తాను ఇంట్లో ఇబ్బందిపడాల్సి వస్తోందన్నారు. అవినీతికి పాల్పడి వందల కోట్లు సంపాదించావని లోకేష్ అంటున్నాడు... ఆ డబ్బంతా ఎక్కడంటూ తన భార్య అడుగుతోందని ఎమ్మెల్యే సుధాకర్ బాబు వ్యంగ్యంగా ప్రశ్నించారు.
నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే సుధాకర్ బాబు అవినీతి, అక్రమాలను వైసిపి నాయకులే కలెక్షన్ బాబు అని పేరుపెట్టుకున్నారని లోకేష్ పేర్కొన్నారు. చిల్లర షాప్ నుండి గ్రానైట్ ప్యాక్టరీల వరకు ఎవ్వరినీ వదలకుండా ఎమ్మెల్యే భారీ వసూళ్లకు పాల్పడుతున్నారని... చివరకు వైసిపి వాళ్లుకూడా పని జరగాలంటే ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిందేనట అని ఆరోపించారు. ఇలా ఎమ్మెల్యే సుధాకర్ బాబు వందల కోట్లు సంపాదించాడని లోకేష్ ఆరోపించారు.
Read More ఇప్పుడు జగన్‌పై అస్త్రంలా .. 2024 ఎన్నికల తర్వాత సునీతమ్మను పక్కనపెడతారు : సజ్జల సంచలన వ్యాఖ్యలు
అయితే లోకేష్ చేసిన అవినీతి ఆరోపణలపై ఎమ్మెల్యే సుధాకర్ బాబు రియాక్ట్ అయ్యారు. లోకేష్ ప్రసంగాన్ని తాను చూడలేదని... కానీ తన భార్య చూసిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వందల కోట్లు సంపాదించానని లోకేష్ అంటున్నారు.... ఆ డబ్బంతా ఏం చేస్తున్నావని భార్య ప్రశ్నిస్తోందని అన్నారు. లోకేష్ మాటలు విని తనను ప్రశ్నిస్తున్న భార్యకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదన్నారు. ఇలా లోకేష్ అవినీతి ఆరోపణల వల్ల తాను ఇంట్లోనే ఇబ్బంది పడాల్సి వస్తోందంటూ ఎమ్మెల్యే సుధాకర్ బాబు సెటైరికల్ గా స్పందించారు.
లోకేష్ కు దమ్ముంటే తాను అక్రమంగా వందలకోట్లు సంపాదించానంటూ చేసిన ఆరోపణలను రుజువు చేయాలని వైసిపి ఎమ్మెల్యే సవాల్ విసిరారు. అలా చేస్తే తాను రాజకీయ సన్యానం తీసుకుంటానని ఎమ్మెల్యే సుధాకర్ బాబు ప్రకటించారు.