తిరుపతి: తెలుగుదేశం పార్టీ (టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో భారీ కుంభకోణం జరిగిందని ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా చెప్పారని ఆమె గుర్తు చేశారు. ఆమె శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 

అమరావతి కుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేస్తే చంద్రబాబు,త ఆయన బినామీలు గజగజ వణుకుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. అమరావతిలో భారీ కుంభకోణం జరిగిందని రోజా ఆరోపించారు. రాజధాని పేరుతో చంద్రబాబు, ఆయన బినామీలు వేల ఎకరాలు కొనుగోలు చేశారని అన్నారు. ఈ కుంభకోణం మీద ఇప్పుడు ఏసీబీ కేసు నమోదు చేస్తే గజగజ వణుకుతున్నారని రోజా అన్నారు. 

ఓ న్యాయవాది మీద కేసు నమోదు చేస్తే హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం బాధాకరమని, ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని అన్నారు. జాతీయ మీడియాతో పాటు మేధావి వర్గం హైకోర్టు ఉత్తర్వులపై విస్మయం వ్యక్తం చేస్తున్నాయని రోజా అన్నారు. అన్ని ఆధారాలతో ఏసీబీ కేసు నమోదు చేసిందని అన్నారు. 

పోలవరం ప్రాజెక్టును ఏటీఎంగా వాడుకున్నారని ప్రధాని చెప్పారని, కానీ చంద్రబాబు తేలు కుట్టిన దొంగలా ఉన్నారని రోజా వ్యాఖ్యానించారు. దుమ్ముంటే ఇప్పుడు చంద్రబాబు అమరావతి భూకుంభకోణం, ఫైబర్ గ్రిడ్  అక్రమాలపై సీబీఐ విచారణ కోరాలని ఆమె అభిప్రాయపడ్డారు. 

అంతర్వేది ఘటనలో ప్రభుత్వం తప్పు లేకపోయినా సీఎం జగన్ సీబీఐ విచారణ కోరారని చెప్పారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తన కుమారుడి మీద ఆరోపణలు వస్తే సీబీఐ విచారణకు ఆదేశించారని ఆమె గుర్తు చేశారు. తన కుమారుడు జగన్ తప్పు చేసి ఉంటే ఉరి తీయండని అసెంబ్లీ సాక్షిగా వైఎస్ చెప్పారని అన్నారు. చంద్రబాబు స్టేలతో బతుకుతున్న వ్యక్తి అని ఆమె అన్నారు. కోర్టులు కూడా అందరికీ ఒకే న్యాయం అందేలా చూడాలని ఆమె కోరారు.