అమరావతి: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు మల్లాది విష్ణుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలకమైన పదవిని అప్పగించారు. ఏపీ బ్రాహ్మణ కార్పోరేషన్ అధ్యక్ష పదవిని మల్లాది విష్ణుకు అప్పగించారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

బ్రాహ్మణ కార్పోరేషన్ పదవిలో మల్లాది విష్ణు రెండేళ్ల పాటు కొనసాగుతారు. 2019 ఎన్నికలకు ముందు మల్లాది విష్ణు వైసీపీలో చేరారు. విజయవాడ సెంట్రల్ సీటు నుంచి ఆయన శాసనసభకు ఎన్నికయ్యారు. టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమామహేశ్వర రావుపై ఆయన విజయం సాధించారు.

మంత్రివర్గంలో చోటు దక్కుతుందని మల్లాది విష్ణు అనుచరులు భావించారు. అయితే, మల్లాది సామాజిక వర్గానికి చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్ ను మంత్రివర్గంలోకి తీసుకుని ఆయనకు దేవాదాయ శాఖ అప్పగించారు. తాజాగా, మల్లాది విష్ణుకు బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. 

కులాలవారీగా వైఎస్ జగన్ కార్పోరేషన్లు ఏర్పాటు చేసి, వాటికి చైర్మన్లను నియమిస్తున్నారు. ఇందులో భాగంగా బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ పదవిని మల్లాదికి అప్పగించారు.