చిత్తూరు జిల్లా చంద్రగిరిలో రాజకీయాలు మరింత వేడెక్కాయి.  సోమవారం పోలీసులు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేశారు. కాగా..తనను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ.. చెవిరెడ్డి సత్యవేడు పోలీస్ స్టేషన్ లోనే దీక్షకు దిగడం గమనార్హం. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. చంద్రగిరి నియోజకవర్గంలోని ఎర్రావారిపాలెంలో ఓట్ల తొలగింపుపై కొద్ది రోజులుగా వివాదం నడుస్తోంది. గ్రామంలో సర్వే చేసేందుకు వచ్చిన వ్యక్తిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. కాగా.. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు వైసీపీ నేతలను అరెస్టు చేశారు. తమ పార్టీ వాళ్లను అక్రమంగా అరెస్టు చేశారని, వదిలి పెట్టాలని డిమాండ్ చేస్తూ చెవిరెడ్డి ఆందోళన చేపట్టారు. పోలీస్ స్టేషన్ ముందు కాసేపు బైఠాయించి నిరసన తెలిపారు. 
అరెస్టయిన ముగ్గురిని విచారణ కోసం పోలీసు ట్రైనింగ్ సెంటర్‌లో ఉంచారని తెలియడంతో.. చెవిరెడ్డి అక్కడికి వెళ్లారు. తమ వాళ్లను విడిపించి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సెక్యూరిటీ స్టాఫ్ అడ్డుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడే బైఠాయించారు. ఇదే సమయంలో.. వైసీపీకి పోటీగా నిరసన తెలుపుతూ టీడీపీ నేతలు కూడా ట్రైనింగ్ సంటర్ వద్దకు వచ్చారు. 

చంద్రగిరి టీడీపీ నేత  పులివర్తి నాని కూడా తన అనుచరులతో ధర్నాకు దిగారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు వెంటనే చెవిరెడ్డిని అక్కడి నుంచి తరలించారు పోలీసులు. ముందు గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడికి కూడా వైసీపీ నేతలు వచ్చే అవకాశం ఉండటంతో.. సత్యవేడుకి తరలించారు.