మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన మాటల తూటాలకు ఫిదాకాని వారంటూ ఎవరూ ఉండరు. ఇప్పుడు ఆయనను, ఆయన మాటలను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెగ వాడేస్తున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ నేతలు త్రివిక్రమ్ ని విపరీతంగా వాడేస్తున్నారు. అది కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని పొగడ్తలతో వర్షం కురిపించడానికే గురూజీని వాడుతున్నారు.

ఇంతకీ అసలు మ్యాటరేంటంటే.... గతేడాది అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే రోజా.. సీఎం జగన్ ని పొగిడేందుకు అరవింద సమేతలోని డైలాగ్ వాడింది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి ఖలేజా సినిమాలో డైలాగ్ వాడారు.

గతేడాది సమావేశాల్లో రోజా మాట్లాడుతూ... ప్రతి సంవత్సరానికి బతుకు ఆలోచన మారుతుందంటారు అధ్యక్షా.. దాన్ని సినిమా లాంగ్వేజ్‌లో ట్రెండ్ అంటారు... రాజకీయ నాయకులు తరం అంటారు.. మామూలు జనం జనరేషన్ అంటారు. కాని ప్రతి జనరేషన్‌కి ఆ కొత్త థాట్‌ని ముందుకు తీసుకువెళ్లేది ఒక్కరే ఉంటారు. ఆయన్నే టార్చ్ బేరర్ అంటారు అంటూ జగన్ గురించి అరవింద సమేత డైలాగులు చెప్పింది రోజా. 

ఇది మరిచిపోకముందే ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి కూడా త్రివిక్రమ్ డైలాగ్ చెప్పేసింది. ఖలేజా సినిమాలో మహేష్ కోసం రాసిన నువ్వు శిఖరం సామి.. అనుకుంటే అయిపోతుంది అంటూ అసెంబ్లీలో అదిరిపోయే స్పీచ్ ఇచ్చింది. అదేవిధంగా పుష్ప శ్రీవాణి జీ తెలుగులో ప్రసారమయ్యే ఓ తెలుగు సీరియల్ డైలాగ్ ని కూడా వాడేసారు. దీంతో... ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఇదే చర్చ జరుగుతోంది.

ఏపీ అసెంబ్లీలో తివిక్రమ్ వాడకం మామూలుగా లేదుగా అంటూ కొందరు మీమ్స్ తయారు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అవి కాస్త వైరల్ గా మారాయి. మరికొందరేమో పుష్పశ్రీవాణిని ట్రోల్ చేస్తున్నారు. మేడమ్ గారు సీరియల్స్ బాగా ఫాలో అవుతారు కాబోలు.. డైలాగ్స్ బట్టీ పట్టి మరీ సభలో వినిపిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం.