ప్రత్యేకహోదా ఆందోళనల సీన్ ఢిల్లీకి మారింది. దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వేదికగా వైసిపి ధర్న చేయాలన్న అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలందరూ ఇప్పటికే డిల్లీకి వెళ్ళారు. సోమవారం ఉదయం నుండి జంతర్ మంతర్ వద్దకు చేరుకుంటున్నారు. ఒకవైపు జంతర్ మంతర్ దగ్గర ఆందోళన మరోవైపు పార్లమెంటు స్ట్రీట్ వద్ద మహాధర్నా చేయాలని వైసిపి ప్లాన్ చేసింది.

అదే సమయంలో పార్లమెంటులో కూడా కేంద్రాన్ని నిలదీయాలని వైసిపి ఎంపిలు వ్యూహాలు సిద్ధం చేశారు. అయితే, వైసిపి ఆందోళనలను భగ్నం చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలోని కొందరు పెద్దలతో మాట్లాడి జంతర్ మంతర్ వద్ద ఆందోళనలకు అనుమతి ఇవ్వకూడదని, పార్లమెంటు స్ట్రీట్ లో ధర్నాను కూడా అడ్డుకోవాలని కొందరు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు వైసిపి వర్గాలు చెప్పాయి.

సోమవారం నుండి పార్లమెంటు బడ్జెట్ రెండో సెషన్ మొదలవుతున్న విషయం తెలిసిందే. మొదటి సెషన్లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత ప్రత్యేకహోదా, రాష్ట్ర ప్రయోజనాల డిమాండ్ తో టిడిపి, వైసిపి ఎంపిలు ఆందోళనలు చేసిన సంగతి అందరూ చూసిందే. జనాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మొదలైన వ్యతిరేకత మొదలైంది. దాంతో వెంటనే మేల్కొన్న చంద్రబాబునాయుడు జనాల ఆగ్రహాన్ని కేంద్రప్రభుత్వంపై మళ్ళించేందుకు ప్రయత్నిస్తున్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గ్రహించిన బిజెపి నేతలు అదే అస్త్రాన్ని చంద్రబాబుపై తిప్పి కొడుతున్నారు. అదే సమయంలో చంద్రబాబుపై జగన్ తన ప్రజాసంకల్పయాత్రలో ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. దాంతో రాజకీయంగా గందరగోళం మొదలైంది. ఇటువంటి నేపధ్యంలోనే కేంద్రపై ఒత్తిడి పెంచేందుకు ఢిల్లోని వేదిక చేసుకోవాలని జగన్ ప్లాన్ చేశారు. మరి, ఈరోజు ఏం జరుగుతుందో చూడాలి.