అధికార యంత్రాంగం వెంటనే స్పందించడం వల్లే విశాఖ ఫిషింగ్ హార్బర్ లో జరిగిన అగ్నిప్రమాద తీవ్రత తగ్గిందని... ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వైవి సుబ్బారెడ్డి అన్నారు.  

విశాఖపట్నం : విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్ లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం మత్స్యకారుల జీవనోపాధిని దహనం చేసింది. చేపల వేటపైనే ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారుల పడవలు మంటల్లో కాలిబూడిదయ్యయి. ఈ అగ్నిప్రమాదంపై స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థికసాయం ప్రకటించారు. మరో నాలుగైదు రోజుల్లో బాధిత మత్స్యకారులకు ఆర్థిక సాయం చేస్తామని వైసిపి నేత వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు.

అగ్నిప్రమాదం జరిగిన విశాఖ ఫిషింగ్ హార్బర్ ను వైసిపి నేతలతో కలిసి వైవి సుబ్బారెడ్డి పరిశీలించారు. కాలిపోయిన బోట్లను పరిశీలించిన బాధిత మత్స్యకారులు, అధికారులతో సుబ్బారెడ్డి మాట్లాడారు. బాధితులకు ధైర్యం చెప్పిన సుబ్బారెడ్డి అతి త్వరలో జగన్ సర్కార్ ప్రకటించిన ఆర్థిక సాయం అందుతుందని తెలిపారు. అధికారులు ఎవరికీ అన్యాయం జరగకుండా బాధితులకు జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని సుబ్బారెడ్డి ఆదేశించారు. 

వీడియో

ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ... అధికార యంత్రాంగం వెంటనే స్పందించడం వల్లే ప్రమాద తీవ్రత తగ్గిందని అన్నారు. పోర్ట్ అధికారులతో పాటు పోలీసులు, స్థానిక మత్స్యకారులు సకాలంలో స్పందించారని... లేదంటే మంటలు మరింత పెద్దవై ఆయిల్ ట్యాంకర్లతో ప్రమాదం వుండేదని సుబ్బారెడ్డి తెలిపారు. 

Read More Pawan kalyan:విశాఖలో బోట్లు నష్టపోయిన మత్య్సకారులకు ఆర్ధిక సహాయం

ఇక ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం గురించి తెలియగానే సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారని... మానవతా దృక్పథంతో స్పందించి ఆర్థిక సాయం ప్రకటించారని అన్నారు. మంటల్లో పూర్తిగా కాలిపోయిన బోటు ఖరీదు ఎంతుంటే అందులో 80 శాతం ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. 20, 30 లక్షలు కాదు 50,60 లక్షల ఖరీదు బోట్లున్నా ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. పాక్షికంగా దెబ్బతిన్న బోట్ల యజమానులకు కూడా సాయం చేస్తామని సుబ్బారెడ్డి తెలిపారు. 

మత్సకారుల కష్టాల గురించి తెలుసుకుని వారికి భరోసా ఇవ్వడానికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనను పంపించారని వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. గతంలో హుద్ హెద్, తిత్లి తుఫానుల సమయంలో టిడిపి పరిహారం ఆలస్యంగా ఇచ్చిందని... తాము అలా చేయమని అన్నారు. నెల రెండునెలలు కాకుండా కేవలం నాలుగైదు రోజుల్లోనే పరిహారం అందిస్తామని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. 

కేవలం పరిహారం మాత్రమే కాదు ఇతర సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ అగ్నిప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పటికే ఏడుగురు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని... దర్యాప్తు కొనసాగుతోందని వైసిపి నేత వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు.