Pawan kalyan:విశాఖలో బోట్లు నష్టపోయిన మత్య్సకారులకు ఆర్ధిక సహాయం
విశాఖపట్టణం షిప్పింగ్ హర్బర్ లో బోట్ల దగ్దంపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్పందించారు. బాధితులను ఆదుకొంటామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
విశాఖపట్టణం: విశాఖపట్టణం షిప్పింగ్ హర్బర్ లో నష్టపోయిన బోట్ యజమానులకు జనసేన తరపున రూ. 50 వేల ఆర్ధిక సహాయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
విశాఖ షిప్పింగ్ హర్బర్ లో అగ్ని ప్రమాదంలో సుమారు 40 బోట్లు దగ్దమయ్యాయి. ఒక్కో బోటు విలువ సుమారు రూ. 20 నుండి 30 లక్షలుగా ఉంటుంది.సుమారు 500 పడవలు లంగరు వేసి ఉన్న సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో వంద బోట్లు చిక్కుకున్నాయి. వీటిలో 40 బోట్లు పూర్తిగా దగ్దమయ్యాయి. మరో 60 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. షిప్పింగ్ హర్బర్ లో ఆదివారంనాడు రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఉద్దేశ్యపూర్వకంగా కొందరు బోట్లను దగ్దం చేశారనే అనుమానాలను మత్స్యకారులు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే బోట్లు నష్టపోయిన మత్స్యకారులకు ఆర్ధిక సహాయం అందించాలని ప్రభుత్వం కూడ నిర్ణయం తీసుకుంది. ఒక్కో బోటు విలువను లెక్కగట్టి 80 శాతం మత్స్యకారులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.
ఈ అగ్ని ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్ని మాపక బృందాలు రంగంలోకి దిగి మంటలను ఆర్పివేశాయి. లేకపోతే అక్కడ ఉన్న బోట్లన్నీ కూడ మంటలకు కాలిబూడిదయ్యే అవకాశం ఉండేది.
ఈ బోట్ల దగ్దం వెనుక అనుమానితులను కొందరిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ బోట్ల దగ్దం ఉద్దేశ్యపూర్వకంగా జరిగిందా , లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బోట్లు దగ్దం కావడంతో తమ జీవనాధారం కోల్పోయామని మత్య్సకారులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే మత్స్యకారులకు అండగా నిలుస్తామని పార్టీలు, ప్రభుత్వం, ప్రజా సంఘాలు ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తన వంతుగా నష్టపోయిన మత్స్యకారులకు ఆర్ధిక సహాయం అందించనున్నారు.