అవిశ్వాసం వీగిపోయాకా సీఎం ఢిల్లీ ఎందుకెళ్లారు...? చంద్రబాబుది ఏ టర్న్: భూమన

YCP Leader karunakar reddy fires on chandrababu naidu
Highlights

అవిశ్వాసం వీగిపోయాకా ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ ఎందుకెళ్లారని ప్రశ్నించారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి

అవిశ్వాసం వీగిపోయాకా ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ ఎందుకెళ్లారని ప్రశ్నించారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. ఇవాళ హైదరాబాద్‌ లోటస్ పాండ్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... అవిశ్వాసంపై చర్చ సందర్భంగా పార్లమెంటు‌లో ఏ ఒక్కరు విభజన చట్టంలోని హామీల గురించి కానీ.. రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి కానీ మాట్లాడలేదన్నారు. అందరూ ఎవరి ప్రయోజనాల గురించి వారు ప్రస్తావించుకున్నారని ఆరోపించారు.

అవిశ్వాసం కథ ముగిసిన తర్వాత చంద్రబాబుకు ఢిల్లీలో పనేంటని... పాత మిత్రుడికి కృతజ్ఞతలు చెప్పాలనా.. లేకపోతే కొత్త పొత్తుల కోసమా..? అని ఎద్దేవా చేశారు.  తమ అధినేత అసెంబ్లీలో చేసిన వాదననే టీడీపీ ఎంపీలు పార్లమెంటులో చదివారని భూమన అన్నారు.. టీడీపీ-బీజేపీ సంబంధాలను హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ బయటపెట్టారని... వైసీపీ ట్రాప్‌లో టీడీపీ పడిందని సాక్షాత్తూ ప్రధానమంత్రే అన్నారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చన్నారు.

అవిశ్వాసం విషయంలో చంద్రబాబు పక్క రాష్ట్రాలను సమన్వయం చేయలేకపోయారని.. మద్ధతు కోసం టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ని కాదని.. కేకేను కలిస్తే ఇలాగే ఉంటుందని భూమన సెటైర్ వేశారు. గతంలో తాము అవిశ్వాసానికి పిలుపునిస్తే పట్టించుకోలేదని.. కానీ ఇప్పుడు మాత్రం కంటితుడుపు చర్యగా అవిశ్వాసం పెట్టి చేతులు దులుపుకున్నారని కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఈ సారైనా బంద్‌లో పాల్గొంటున్న ప్రజలను భయపెట్టకుండా.. వారికి ఇబ్బందులు కలిగించకుండా ఉండాలని భూమన ప్రభుత్వాన్ని కోరారు.
 

loader