వెంకటగిరి వైసీపీలో వర్గపోరు .. నేదురుమల్లిపై కలిమిలి విమర్శలు, నేనే రాజు అంటే కుదరదని వార్నింగ్
ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వైసీపీ ఇన్‌ఛార్జ్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డికి ఆ పార్టీ నేత కలిమిని రాంప్రసాద్ రెడ్డికి మధ్య పడటం లేదు . నేనే రాజు, నేనే మంత్రి, ఈసారి టికెట్ నాదే అంటే కుదరదని.. నియోజకవర్గంలో నేదురుమల్లి నియంతలా వ్యవహరిస్తున్నారని రాంప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

వై నాట్ 175 అంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ వైసీపీ శ్రేణులకు టార్గెట్ నిర్దేశించారు. నిత్యం జనాల్లో వుండాలని కూడా ఆయన ఆదేశించారు. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్ధితులు మాత్రం మరోలా వున్నాయి. నేతలు నియోజకవర్గాల్లో ఆధిపత్యం కోసం ఒకరిపై ఒకరు విమర్శలకు దిగుతున్నారు. ఇంకొందరైతే టికెట్ నాదేనంటూ రచ్చ చేస్తున్నారు. తాజాగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వైసీపీ ఇన్‌ఛార్జ్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డికి ఆ పార్టీ నేత కలిమిని రాంప్రసాద్ రెడ్డికి మధ్య పడటం లేదు.
నేదురుమల్లి తీరు కారణంగా పార్టీలో సమన్వయం లోపించిందని కలిమిలి విమర్శించారు. నేనే రాజు, నేనే మంత్రి, ఈసారి టికెట్ నాదే అంటే కుదరదని రాంప్రసాద్ రెడ్డి దుయ్యబట్టారు. గ్రామగ్రామానా పార్టీ కోసం కష్టపడిన నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ లేదని కలిమిలి ఆరోపించారు. నియోజకవర్గంలో నేదురుమల్లి నియంతలా వ్యవహరిస్తున్నారని రాంప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: జగన్ కేబినెట్ లో దశావతారాలు...ఏ మంత్రిది ఏ అవతారమంటే..: మంత్రి వేణుగోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇటీవల వెంకటగిరిలో జరిగిన సీఎం జగన్ పర్యటన సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై అధిష్టానానికి తెలియజేశామని ఆయన వెల్లడించారు. నేదురుమల్లి ఇలాగే వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందని కలిమిలి హెచ్చరించారు. భయపెట్టడం, బెదిరించడం మానుకోవాలని ఆయన సూచించారు. టికెట్ ఎవరికి అనేది సీఎం వైఎస్ జగన్ నిర్ణయిస్తారని రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.