జగన్ కేబినెట్ లో దశావతారాలు...ఏ మంత్రిది ఏ అవతారమంటే..: మంత్రి వేణుగోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
వైఎస్ జగన్ మంత్రివర్గంలో బిసి మంత్రుల విష్ణుమూర్తిలా దశావతారాాలు పోషిస్తున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

అమరావతి: జగన్ కేబినెట్ లో బిసిలకు సముచిత స్థానం లేదంటూ ప్రతిపక్ష టిడిపి నాయకులు చేస్తున్న ఆరోపణలపై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పది మంది బిసిలకు మంత్రివర్గంలో చోటు కల్పించడమే కాదు కీలకమైన శాఖలను కేటాయించారని ఆయన అన్నారు.
ఇలా రాక్షసులను అంతం చేయడానికి విష్ణుమూర్తి పది అవతారాలు ఎత్తినట్లే పేదరికాన్ని అంతం చేయడానికి వైసిపి ప్రభుత్వంలోని మంత్రులు దశావతారాలు ఎత్తారన్నారు. ఒక్కో మంత్రి ఒక్కో అవతారం ఎత్తినట్లుగా బిసిలను పట్టిపీడిస్తున్న సమస్యల పరిష్కారానికి పనిచేస్తున్నారని మంత్రి వేణుగోపాల్ తెలిపారు.
మహిళలు, శిశు సంక్షేమం కోసం పాటుపడుతున్న మంత్రి ఉషశ్రీ చరణ్ ది మొదటి అవతారం అని వేణుగోపాల్ అన్నారు. ఇక చిన్నారుల అక్షరాభ్యాసం, విద్యాబుద్దుల బాధ్యత చూసుకునే విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణది రెండోది... ఆకలి తీర్చే పౌరసరఫరాల శాఖమంత్రి కారుమూరి నాగేశ్వరరావుది మూడో అవతారం అన్నారు. పౌష్టికాహారం అందించే పాడి పశువుల పోషణ, సంరక్షణ శాఖ బాధ్యతలు చూసుకునే మంత్రి సిదిరి అప్పలరాజుది నాలుగో అవతారం అని చెల్లుబోయిన వేణుగోపాల్ పేర్కోన్నారు.
Read More ఎందుకురా జోకులేసి చంపుతారు!: నారా భువనేశ్వరిపై అంబటి సెటైర్లు
ఇక అనారోగ్యం బారిన పడితే ఆదుకునే వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజనిది ఐదో అవతారం అన్నారు. తినే ఆహారాన్ని, ఆర్థిక పంటలు పండించే భూవ్యవహారాలు చూసుకునే రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావుది ఆరో అవతారం అన్నారు. చెట్ల నీడన, గుడిసెల్లో బ్రతికే పేదలకు వసతి కల్పించే గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ది ఏడోది... రెక్కల కష్టాన్ని నమ్ముకుని పనిచేసేవారికి అండగా నిలిచే కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ ది ఎనిమిదవ అవతారం అన్నారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్దికి పాటుపడే పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి బూడి ముత్యాల నాయుడిది తొమ్మిదో అవతారమని అన్నారు. ఇక అన్ని సంక్షేమ పథకాలను, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరువచేసే బిసి సంక్షేమ, సమాచార శాఖ మంత్రిగా నాది దశమ అవతారమని మంత్రి వేణుగోపాల్ అన్నారు. ఇలా బీసీలను పట్టిపీడిస్తున్న సమస్యతను దూరంచేసి రక్షించే పది అవతారాలు బిసిలవే అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ పేర్కొన్నారు.