విజయవాడ: గుణదలలో మహిళా కార్పోరేటర్ అభ్యర్థిపై జరిగిన దాడి ఘటనపై నిజాలు నిగ్గు తేల్చాలని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పోలీసులను కోరారు. టీడీపీ నేతల ఆరోపణలపై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు అవినాష్.

అనంతరం అవినాష్ మాట్లాడుతూ... నిన్న(మంగళవారం) జరిగిన దాడిపై టిడిపి నాయకులు గద్దె రాంమోహన్, బుద్దా వెంకన్మ అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రశాంతంగా ఉన్న  బెజవాడలో టీడీపీ నేతలు అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేత అదే పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిపై దాడి చేస్తే వైసీపీకి అంటగడుతూన్నారని అన్నారు. దాడి చేసిన కోనేరు వాసు టీడీపీ వ్యక్తి అనడానికి  లోకేష్, చంద్రబాబు, ఉమాతో ఉన్న పరిచయం, ఫోటోలే ఆధారమన్నారు. 

''ఉమా చేపట్టే ప్రతి కార్యక్రమంలో దాడికి పాల్పడ్డ కోనేరు వాసు పాల్గొంటున్నారు. అలాగే ఈ దాడి చేసిన వాసు ఇంటిని రాంమోహన్ పార్టీ కార్యాలయం కోసం వాడుకున్న విషయం మర్చిపోయారా. చనిపోయిన మాజీ మంత్రి నెహ్రు గురించి గద్దె  పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. నెహ్రుపై 20వేల ఓట్లతో ఓడిపోయిన రాం మోహన్  నెహ్రూను విమర్శించడం సిగ్గు చేటు'' అన్నారు.

video   విజయవాడ ఉద్రిక్తత... టిడిపి మహిళా అభ్యర్థిపై దాడి, కొడుకుపై కత్తితో...

''తన గెలుపు కోసం కృషి చేయాలని రాంమొహన్ నన్ను అడిగింది నిజం కాదా. గద్దె రాం మోహన్ ఒక గుంట నక్క. టీడీపీ నేతలు టీడీపీ నేతలు గొడవలు పడి కొట్టుకుంటే వైసీపీకి ముడి పెడతారా. దాడి చేసిన కోనేరు వాసు వైసీపీ జెండా ఎప్పుడు పట్టుకున్నారూ. వాస్తవాలు మాట్లాడాలని గద్దెను హెచ్చరిస్తున్నా. అలాగే లోకేష్ ,చంద్రబాబును హెచ్చరిస్తున్నా'' అన్నారు.

''సోషల్ మీడియా మాకు ఉంది లోకేష్. మేము తప్పుడు ప్రచారం చెయ్యాలంటే టెక్నాలజీతో, మా బలంతో మేము కూడా చేయగలం. లోకేష్ కు సొంత పార్టీ నేతలు ఎవరు వైసీపీ నేతలు ఎవరో తెలియదా.విజయవాడ నగరాన్ని ప్రశాంతంగా ఉంచుతామని మా కుటుంబ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా'' అని అవినాష్ తెలిపారు.