వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి దాడి జరిగే అవకాశం ఉందంటూ  ఆ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఈ నెల 9వ తేదీన జగన్ పాదయాత్ర ముగియనున్న సంగతి తెలిసిందే.  కాగా.. ఇచ్ఛాపురంలో నిర్వహించనున్న ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి కోరారు. 

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జగన్‌ ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన పాదయాత్ర మొదలుకొని టీడీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు అడ్డుపడుతున్నా సజావుగా సాగిందన్నారు. పాదయాత్రలో వచ్చిన ప్రజాదరణ చూడలేక టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారన్నారు. ఎన్ని ఆటం కాలు సృష్టించినా భగవంతుడు ఇచ్చిన బలం, ప్రజల సహకారంతో పాదయాత్ర దిగ్విజయంగా జరుగుతోందన్నారు.

జగన్‌ పాదయాత్ర పూర్తయిన వెంటనే తిరుమలకు అలిపిరి నుంచి కాలి నడకన వెంకన్న దర్శనానికి వెళ్లనున్నారని, ఈ సందర్భంగా సంఘ విద్రోహ శక్తులు జగన్‌పై దాడి చేసే అవకాశం ఉందని టీడీపీ నుంచే సమాచారం వచ్చిందన్నారు. జగన్‌పై హిందుత్వ దాడి చేసే కుట్రకు చంద్రబాబు తెరతీస్తున్నారని మాకు సమాచారం వచ్చిందని చెప్పారు. కాగా.. భూమా కామెంట్స్ ప్రస్తుతం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.