మంత్రి పరిటాల సునీత నుంచి తనకు ప్రాణహాని ఉన్నట్లు వైఎస్ఆర్ సీపీ కార్యకర్త బోయ సూర్యం ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి, మంత్రి కొడుకు, టిడిపి నేతలు తనను బెదిరిస్తున్నారు కాబట్టి తనకు భద్రత కావాలంటూ సూర్యం మొత్తుకుంటున్నారు.

అనంతపురం జిల్లాలో పరిటాలసునీత ఆదేశాలతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని మరోసారి రుజువైంది. టీడీపీలో చేరకపోతే చంపుతామని తనను ఆ పార్టీ కార్యకర్తలు బెదిరించారని దాడికి గురైన వైసిపి కార్యకర్త బోయ సూర్యం ఆరోపించారు.  మీడియాతో మాట్లాడుతూ పరిటాల శ్రీరామ్ సమక్షంలోనే తనపై దాడి జరిగిందన్నారు. తనతో బలవంతంగా టీడీపీ నేతలు సంతకాలు సేకరించుకున్నట్లు కూడా సూర్యం ఆరోపిస్తున్నారు. 

‘టీడీపీలో చేరకపోతే చంపుతామని బెదిరించి తెల్లకాగితాలపై సంతకాలు చేయిస్తుంటే పోలీసులు చోద్యం చూస్తు’న్నట్లు మండిపడ్డారు. అదే సంతకంతో వైఎస్సార్‌సీపీ నేతలు తోపుదుర్తి చందు, నాగరాజులపై పోలీసులు అక్రమంగా కేసులు నమోదుచేసినట్లు చెప్పారు. మంత్రి పరిటాల సునీత అరాచకాలపై ఎస్పీ కూడా మౌనంగా ఉన్నట్లు వాపోయారు.

రామగిరి మండలంలో  పార్టీ సమావేశాలు నిర్వహించేందుకు మూడేళ్లుగా అడుగుతున్నా అనుమతి ఇవ్వటం లేదన్నారు. మంత్రి, ఆమె కొడుకు శ్రీరామ్ అరాచకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తోపుదుర్తి మాట్లాడుతూ, రామగిరిలో సూర్యంపై దాడి చేసి తిరిగి తమపైనే అక్రమ కేసులు బనాయించటం ఏంటంటూ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. మంత్రి పరిటాల సునీతను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పరిటాల వర్గీయుల అరాచకాలపై హైకోర్టులో పోరాడుతామని ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు.