విజయవాడ: కాపు రిజర్వేషన్ అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వణుకు పుట్టిస్తోంది. నాలుగేళ్లుగా అధికార పార్టీ టీడీపీని కుదుపేస్తున్న కాపు రిజర్వేషన్ల సెగ ఇప్పుడు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగిలింది. కాపు రిజర్వేన్లపై వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలే అందుకు కారణమయ్యాయనేది బహిరంగ రహస్యం. 

గత ఎన్నికల్లో కాపులను బీసీల్లో చేరుస్తామంటూ అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆ పార్టీకి తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టాయనడంలో ఎలాంటి సందేహం లేదు.  కాపులను బీసీలో చేర్చేందుకు మంజునాథ్ కమిషన్ వేసినా...కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యికోట్లు కేటాయించినా.....కాపులకు డిప్యూటీ సీఎం పదవి, హోంశాఖ కట్టబెట్టినా ప్రతికూల పరిస్థితి మాత్రం తప్పలేదు అధికార పార్టీకి. 

ఏం చేసినా అల్టిమేట్ మాత్రం కాపు రిజర్వేషన్లు. దానిపై స్పష్టమైన క్లారిటీ ప్రకటిస్తేనే కానీ వారి నాడి పట్టుకోలేం. ఇదిలా ఉంటే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సమయం వచ్చినప్పుడల్లా సీఎం చంద్రబాబు నాయుడును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. లేఖలు రాయడం...సమావేశాల్లో ఘాటుగా విమర్శించడం...దీంతో కాపు సామాజిక వర్గం టీడీపీని నమ్మలేనంత పరిస్థితికి వచ్చేసింది. 

అమరావతి బాండ్లపై చంద్రబాబు మీద జగన్ సంచలన ఆరోపణ

కాపు సామాజిక వర్గం టీడీపీకు దూరమవుతుందని సంబరపడిన వైసీపీకి ప్రస్తుతం అదే పరిస్థితి నెలకొంది. తూర్పు గోదావరి జిల్లాలో ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జగ్గంపేట, పిఠాపురం బహిరంగ సభలలో కాపు రిజర్వేషన్లపై జగన్‌ చేసిన ప్రకటనలే కాపు సామాజిక వర్గం దూరమవుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. 

ఆ ప్రకటన మరువకముందే  పవన్‌కల్యాణ్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు మరింత ఆజ్యం పోశాయి. ఈ వ్యాఖ్యలు వైసీపీ పట్ల వ్యతిరేకతను చూపుతున్నాయని సర్వేలు తేల్చిచెప్తున్నాయి. అంతేకాదు రెండు రోజుల క్రితం పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్సీ కందుల లక్ష్మీ దుర్గేష్ పార్టీ వీడటం అందుకు బలాన్నిచేకూరుస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన దుర్గేష్ పార్టీ వీడి జనసేనలోకి వెళ్తున్నట్లు ప్రకటించడం వైసీపీ వెన్నులో వణుకు పుడుతోందట. కాపు రిజర్వేషన్లపై వైసీపీ స్పష్టమైన వైఖరి ప్రదర్శించాలని లేని పక్షంలో ఒక్కొక్కరు పార్టీని వీడే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. 

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా కాపు సామాజిక వర్గానికి చెందిన కురసాల కన్నబాబును నియమించినా అతను అంత ప్రభావితం చెయ్యలేకపోతున్నారని సమాచారం. ఇదే జిల్లాలో వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు దివంగత మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు. జక్కంపూడి రామ్మోహనరావు మరణానంతరం ఆయన కుటుంబం ఇప్పటి వరకు వైసీపీలోనే ఉంది.

 జక్కంపూడి రామ్మోహన రావు ఆయన కుటుంబం జిల్లాలోని కాపు సామాజిక వర్గాన్ని ప్రభావితం చెయ్యగలదనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే వైసీపీలో జక్కంపూడి కుటుంబం జక్కంపూడి విజయలక్ష్మీ, జక్కంపూడి రాజా,గణేష్ లు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడి గా జక్కంపూడి రాజా బాధ్యతలు నిర్వహిస్తుంటే జక్కంపూడి విజయలక్ష్మీ కేంద్రపాలక మండలి సభ్యురాలిగా..రాజానగరం నియోజకవర్గ ఇంచార్జ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

అయితే జగన్ పాదయాత్రలో మాజీమంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు పేరును ప్రస్తావించకపోవడం...రాజానగరం నియోజకవర్గంలో టూర్ లేకపోవడంతో కాస్త అలిగారు. తూర్పుగోదావరి జిల్లాలో తొలిసారిగా జగన్ వెంట నడిచిన కుటుంబం జక్కంపూడి రామ్మోహన్ రావు కుటుంబం. అలాంటిది వారు దూరం అయితే పార్టీ పరిస్థితి వేరేగా ఉంటుందని అధినేతకు సంకేతాలు కూడా వెళ్లాయి. రెండు రోజులపాటు అలిగినా ఆ తర్వాత రాజా జగన్ పాదయాత్రలో కనిపించడంతో వైసీపీ ఊపిరిపీల్చుకుంది. 

మరోవైపు తూర్పు పశ్చిమగోదావరి  జిల్లాలకు సంబంధించి 34 నియోజకవర్గాల్లో దాదాపు అన్నినియోజకవర్గాల గెలుపు ఓటములు నిర్ణయించే బలం కాపు సామాజిక వర్గానికి ఉంది. అదే రాష్ట్ర వ్యాప్తంగా అయితే కనీసం 75 స్థానాలను కాపు సామాజిక వర్గం ప్రభావితం చెయ్యగలదు....అలాంటి కాపు సామాజిక వర్గం దూరమయ్యే ప్రమాదం ఉందని వైసీపీ ఆందోళన చెందుతుంది. 


ముద్రగడ పద్మనాభంతో వైసీపీ నేతలు టచ్ లో ఉన్నా జగన్ రిజర్వేషన్ల అంశంపై యూ టర్న్ తీసుకోవడం....పవన్ ను విమర్శించడం మాత్రం ఆ సామాజిక వర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని వైసీపీ గ్రహించిందట. ఇప్పటికే వైసీపీ నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన కందుల లక్ష్మీదుర్గేష్ పార్టీ వీడటంతో మరింత మంది ఆయన మార్గంలో పయనించకముందే జాగ్రత్త పడాలని పార్టీ భావిస్తుంది.

ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు ప్రత్యేక ప్లాన్ లలో నిమగ్నమయ్యిందట వైసీపీ అధిష్టానం. కాపు సామాజిక వర్గానికి ప్రస్తుతం పెద్ద దిక్కుగా చెప్పుకుంటున్నబొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబులను రంగంలోకి దింపిందట. జక్కంపూడి కుటుంబంతో కలిసి బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు వంటి కాపు సామాజిక వర్గం నేతలు ఉభయగోదావరి జిల్లాలలో పర్యటించాలని భావిస్తున్నారట. 

నవంబర్ నెలాఖరుకు పాదయాత్ర ముగిసే అవకాశం ఉండటంతో ఎన్నికల ప్రచారయాత్ర ప్రారంభం కానుందని ఆ ఎన్నికల ప్రచారం కంటే ముందే కాపు సామాజిక వర్గం టూర్ ఉంటే బాగుంటుందని పార్టీ భావిస్తోందట. 2019 ఎన్నికలకు జగన్ పార్టీకి కాపులు కాపు కాస్తారా లేక హ్యాండిస్తారా అన్నది వేచి చూడాలి......

ఈ వార్తలు కూడా చదవండి...

ఉత్తరాంధ్రలో జగన్ ప్లాన్ ఇదేనా...?

జగన్ కు 'కాపు' షాక్: జనసేనలోకి మాజీ ఎమ్మెల్సీ

కాంగ్రెసుకు షాక్: వైసిపిలోకి మాజీ కేంద్ర మంత్రి?