Asianet News TeluguAsianet News Telugu

ఉత్తరాంధ్రలో జగన్ ప్లాన్ ఇదేనా...?

 ఉత్తరాంధ్రకు రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఉత్తరాంధ్రలో పట్టుకోసం పార్టీలో పోటీపడుతుంటాయి. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఆధిప్యతం కోసం పోటీ పడ్డాయి. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ విజయదుందుభి మోగించగా....వైసీపీ చావుతప్పి కన్నులొట్టబోయింది. 2019 ఎన్నికల్లో అలాంటి పరిస్థితి రాకూడదని 20 అసెంబ్లీ స్థానాలు ఐదు ఎంపీ స్థానాలు గెలుపొందాలని వ్యూహం రచిస్తోందట వైసీపీ.

YS Jagan Future Plans to Strengthen YSRCP in Uttarandhra
Author
Vishakhapatnam, First Published Aug 17, 2018, 3:39 PM IST

విశాఖపట్టణం: ఉత్తరాంధ్రకు రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఉత్తరాంధ్రలో పట్టుకోసం పార్టీలో పోటీపడుతుంటాయి. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఆధిప్యతం కోసం పోటీ పడ్డాయి. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ విజయదుందుభి మోగించగా....వైసీపీ చావుతప్పి కన్నులొట్టబోయింది. 2019 ఎన్నికల్లో అలాంటి పరిస్థితి రాకూడదని 20 అసెంబ్లీ స్థానాలు ఐదు ఎంపీ స్థానాలు గెలుపొందాలని వ్యూహం రచిస్తోందట వైసీపీ. అందుకు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రే వేదిక కానుందట. దీంతో పార్టీ నేతలు జగన్ పాదయాత్రే ఎన్నికల ప్రచారంలా భావిస్తున్నారట. మరి జగన్ పాదయాత్ర పార్టీకి ఏ మేరకు ఫలితాన్నిస్తుందో వేచి చూడాలి. 

ఉత్తరాంధ్రలో గత ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో విజయదుందుభి మోగించాలని భావిస్తోంది. గత ఎన్నికల్లో జరిగిన  అనుభవాలను దృష్టిలో పెట్టుకుని గెలుపే పరమావధిగా ప్రణాళిక రచిస్తోంది. 2014 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో 25 స్థానాల్లో వైసీపీ పోటీ చేస్తే కేవలం తొమ్మిది స్థానాలతో సరిపెట్టుకోగా....పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ విశాఖపట్టణం ఎంపీగా పోటీ చేసి ఘోర పరాజయం చవిచూశారు. 

ఇక తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిస్తే కేవలం 5మంది మాత్రమే పార్టీలో ఉండగా మిగిలిన నలుగురు సైకిలెక్కేశారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత గెలిచిన వెంటనే హ్యాండ్ ఇచ్చేశారు. ఇవన్నీ ఇలా ఉంటే పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టాయి. దీంతో ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గందరగోళంగా మారింది. ఉన్నకొద్దిమంది సీనియర్ నేతలు తమ ప్రాభవం కోసం పాకులాడుతున్నారే తప్ప పార్టీ కోసం పనిచెయ్యడం లేదన్న విమర్శలున్నాయి. 

దీంతో జిల్లాలో పార్టీ బలోపేతం బాధ్యతను సీనియర్లకు అప్పగించారు అధ్యక్షుడు జగన్. శ్రీకాకుళం జిల్లా బాధ్యతలను మాజీమంత్రి ధర్మాన ప్రసాద్, రెడ్డి శాంతి, విజయనగరం జిల్లా బాధ్యతలను బొత్స సత్యనారాయణ, కోలగట్ల వీరభద్రస్వామి, విశాఖపట్టణంలో ఎంపీ విజయసాయిరెడ్డిలకు అప్పగించారు. అయినా పార్టీలో కుమ్ములాటలు మాత్రం నిలువరించలేకపోయారు. రాష్ట్రరాజకీయాలను ఒంటిచేత్తో నడిపిన బొత్స సత్యనారాయణ సైతం ఈ వర్గపోరుతో నానా ఇబ్బందులు పడుతుండటం గమనార్హం. 

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ప్రత్యేక దృష్టి సారించారు జగన్. 2014 ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోవడంతో ఆ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్నజగన్ పార్టీ బలోపేతం కోసం దిశానిర్దేశం చేస్తున్నారు. ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్న లక్ష్యంతో పార్టీలో చేరికలకు సైతం ప్లాన్ వేశారట. ఉత్తరాంధ్ర పాదయాత్ర వలసలకు ప్రాధాన్యత ఇవ్వనుందని సంకేతిలిచ్చారు. 

ప్రస్తుతం విశాఖపట్టణంలోని నర్సీపట్నం నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర కొనసాగుతంది. ఈ నియోజకవర్గం మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో పట్టున్న నేత లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యే బోళెం ముత్యాలపాపను పార్టీలోకి తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. 

వచ్చే ఎన్నికల్లో అయ్యన్నపాత్రుడిపై ముత్యాలపాపను బరిలోకి దించాలని వైసీపీ ఆలోచిస్తున్నట్టు సమాచారం. వీరితోపాటు మాజీమంత్రి కొణతాల రామకృష్ణ, మాజీ ఎంపీ సబ్బం హరిలను పార్టీలోకి తీసుకోవాలని ఆలోచించినా చేరికలపై ఇంకా ఒక క్లారిటీ రావడం లేదు. ఇకపోతే పలు నియోజకవర్గాల్లో నియోజకవర్గ ఇంచార్జ్ లను తరచూ మార్చడం పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతుంది. అందులో భాగంగానే విశాఖ జిల్లాలో చోడవరం ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, అరకు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిలు పార్టీ మారారని అనడంలో ఎలాంటి సందేహం లేదు.   

ఇకపోతే విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతమయ్యింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామిల మధ్య వర్గపోరు మాత్రం నిలువరించలేకపోతున్నారు. దీంతో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఇద్దరు వ్యవహరిస్తున్నారు. 

ఇదిలా ఉంటే గతంలో రాష్ట్రరాజకీయాలను శాసించిన బొత్స సత్యనారాయణ తన హవాను కొనసాగిస్తూనే ఉన్నారు. తనమార్క్ రాజకీయాలతో దూసుకుపోతున్నారు. జిల్లాలో తన ప్రభావం చూపించుకునేందుకు బొత్స సత్యనారాయణ ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ మూడు నియోజకవర్గాలను గెలుచుకుంది. అయితే బొబ్బిలి నియోజకవర్గం ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగరావు సీనియర్ నేత బొత్స సత్యనారాయణతో పొసగక పార్టీకి బై చెప్పి సైకిలెక్కి మంత్రి కూడా అయ్యారు. కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొరలు మాత్రం పార్టీలోనే ఉన్నారు.  

అయితే బొత్స సత్యనారాయణ ఈసారి మాత్రం అత్యధిక స్థానాలను వైసీపీ గెలుచుకునేలా ప్లాన్ చేస్తున్నారు. గజపతినగరం, చీపురుపల్లి, పార్వతీపురం, నెల్లిమర్ల నియోజకవర్గాలను కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయనగరం నియోజకవర్గాన్ని కూడా గెలిపించుకోవాలని కసితో ఉన్నారు. అటు బొబ్బిలి నియోజకవర్గంపై కూడా పట్టుబిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్ జగన్ పాదయాత్ర విజయనగరం జిల్లాలోకి వచ్చేసరికి భారీగా చేరికలు ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇకపోతే శ్రీకాకుళం జిల్లాలో అయితే వైసీపీ ఎక్కువ స్థానాలను దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతుంది. 2014 ఎన్నికల్లో జిల్లాలో మూడు స్థానాలను వైసీపీ గెలుచుకోగా పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, పాలకొండ ఎమ్మెల్యే కళావతిలు పార్టీలోనే కొనసాగుతున్నారు. 

అయితే పార్టీలో పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు వర్గపోరును ప్రోత్సహిస్తున్నారని ప్రచారం. జిల్లాలో తన అనుచరులకు ప్రాధాన్యత ఇస్తున్నారే తప్ప ప్రజల మనోభవాలను పట్టించుకోవడం లేదని సమాచారం. ముఖ్యంగా పలాస, టెక్కలి, ఇచ్చాపురం, శ్రీకాకుళం నియోజకవర్గాల  ఇంచార్జ్  లను మార్చి తన అనుచరులకు బాధ్యతలు అప్పగించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. టెక్కలిలో దువ్వాడ శ్రీనుకు మంచి పట్టుండగా పేరాడ తిలక్ ను తెరపైకి తెచ్చారని అలాగే పలాస నియోజకవర్గం ఇంచార్జ్ గా ఉన్న వజ్జె బాబురావును కాదని తన అనుచరుడైన డా.సీదిరి అప్పలరాజును నియమించడం వివాదాస్పదమవుతుంది. 

ఇచ్చాపురం నియోజకవర్గం విషయానికి వస్తే నియోజకవర్గ ఇంచార్జ్ రామారావును కాదని పార్టీ నుంచి పిరియా సాయిరాజ్ ను నియమించడం చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే టెక్కలి నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసేందుకు మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి ప్రయత్నిస్తున్నారని ఆమెను పార్టీలోకి రాకుండా ధర్మాన అడ్డుకుంటున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు జిల్లాలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మెహన్ నాయుడుల ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో ధర్మాన వైఫల్యం చెందుతున్నారని విమర్శలు కూడగట్టుుకున్నారు. జగన్ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాకు చేరుకునే సరికి పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఓ కొలిక్కి వస్తాయా లేక నాయకత్వ మార్పులు ఉంటాయా వీటన్నింటిని పక్కనపెట్టి పార్టీ చేరికలు ఉంటాయా అన్నది జోరుగా చర్చజరుగుతోంది.  

ఉత్తరాంధ్రలోకి వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర చేరుకునేసరికి భారీగా చేరికలు ఉంటాయని జోరుగా ప్రచారం జరిగింది. వలసలతో వైసీపీ మరింత బలపడుతుందని వైసీపీ లీకులు సైతం ఇచ్చింది. జగన్ పాదయాత్ర గెలుపుయాత్ర అంటూ చెప్పుకొచ్చింది. జగన్ పాదయాత్ర ఉత్తరాంధ్రలోకి వచ్చినా ఎక్కకడ చేరికలు కనిపించకపోవడంతో పార్టీనేతలు విస్మయానికి గురవుతున్నారు. 

 

ఇవి చదవండి

కాంగ్రెసుకు షాక్: వైసిపిలోకి మాజీ కేంద్ర మంత్రి?

Follow Us:
Download App:
  • android
  • ios