Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెసుకు షాక్: వైసిపిలోకి మాజీ కేంద్ర మంత్రి?

మాజీ కేంద్రమంత్రి డా. కిల్లి కృపారాణి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా అంటే ఔననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో హస్తానికి హ్యాండిచ్చి వైసీపీ కండువా కప్పుకోనున్నారట. 

Ex Union Minister Killi Krupa Rani to join YCP ?
Author
Srikakulam, First Published Aug 17, 2018, 4:05 PM IST

శ్రీకాకుళం జిల్లా: మాజీ కేంద్రమంత్రి డా. కిల్లి కృపారాణి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా అంటే ఔననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో హస్తానికి హ్యాండిచ్చి వైసీపీ కండువా కప్పుకోనున్నారట. 2009 ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీగా గెలిచిన ఆమె మన్మోహన్ సింగ్ కేబినేట్లో కేంద్ర సమాచార మరియు టెలీకమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా పనిచేశారు. 

రాష్ట్ర విభజన అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లో ఆమె ఘోరంగా ఓటమి చెందారు. రాష్ట్ర విభజన పుణ్యమా అంటూ కొద్దిరోజులపాటు రాజకీయాల్లో స్థబ్ధుగా ఉన్న ఆమె ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే సమావేశాలకు...నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులపాటు పర్యటించిన జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై పెదవి విరిచారు. ఇప్పుడే కోలుకోవడం కష్టమని తేల్చి చెప్పారు. 

అటు కాంగ్రెస్ పార్టీలో ఉంటే తన రాజకీయ భవిష్యత్ కష్టమని భావిస్తున్న కృపారాణి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. గతంలోనే మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు వైసీపీలో చేరినప్పుడే ఆమె కూడా చేరతారని ప్రచారం జరిగింది. అయితే ఆమె చేరకుండా కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. 

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీలో చేరాలని భావిస్తున్నారట. అందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సంప్రదింపులు కూడా జరిపారని తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అయితే టెక్కలి అసెంబ్లీ సీటుపై దువ్వాడ శ్రీను మరియు పేరాడ తిలక్ లు పోటీ పడుతున్న నేపథ్యంలో టిక్కెట్ అసాధ్యమని వేరే స్థానం చూసుకోవాలని సూచించారట. 

అయితే కళింగ సామాజిక వర్గానికి చెందిన కిల్లి కృపారాణి తన సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా ఉన్న పలాస టిక్కెట్ ఇవ్వాలని కోరారట. అయితే జగన్ ఖచ్చితమైన హామీ ఇవ్వకపోవడంతో స్తబ్ధుగా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ  జగన్ సీటు ఇస్తానని ఖచ్చితమైన హామీ ఇస్తే వైసీపీలోకి వెంటనే వచ్చేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios