మిత్రపక్షాలతో పాటు ప్రతిపక్షాలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని వైసీపీలోకి చేర్చుకునే విషయమై జగన్ దృష్టి పెట్టినట్లు స్పష్టమవుతోంది.

అధికార టిడిపి ప్రతిపక్షానికి చెందిన ఎంఎల్ఏలపై దృష్టి పెడితే, ప్రతిపక్ష వైసీపీ వివిధ పార్టీల్లోని ద్వితీయ శ్రేణి నేతలను పార్టీలోకి చేర్చుకోవటంపై దృష్టి సారిచింది. తెలుగుదేశంపార్టీ, భాజపాతో పాటు కాంగ్రెస్ లోని ద్వితీయ శ్రేణి నాయకత్వంపై వైసీపీ గురి పెట్టినట్లు కనబడుతోంది.

మిత్రపక్షాలైన టిడిపి, భాజపాలకు చెందిన నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, రాజేంద్ర, వెంకట్రామిరెడ్డి తదితరులతో పాటు కాంగ్రెస్ నేత దుర్గేష్ వైసీపీలో చేరారు. వీరిలో భాజపాకు చెందిన మాజీ ఎంఎల్ఏ, విజయవాడ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ కాగా అనంతరపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని టిడిపి నేతలు రాజేంద్ర, వెంకట్రామరెడ్డి తదితరులున్నారు.

ఇక, తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎంఎల్సి కందుల దుర్గేష్ కూడా వైసీపీలో చేరారు.

రాష్ట్రం మొత్తం మీద బలహీనంగా ఉన్న నియోజకవర్గాలను బలోపేతం చేయటంపై జగన్ దృష్టి పెట్టినట్లు కనబడుతోంది. ఇందులో భాగంగానే మొదట విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వెల్లంపల్లిపై జగన్ దృష్టి పెట్టారు. వెల్లంపల్లి వైశ్య సామాజిక వర్గానికి చెందిన నేత. వచ్చే ఏడాదిలో జరుగనున్న స్ధానిక సంస్ధల ఎంఎల్సీ ఎన్నికల్లో పోటీ చేయించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అదేవిధంగా అనంతపురం జిల్లాలో మొన్నటి ఎన్నికల్లో టిడిపి మెజారిటీ స్దానాలు గెలుచుకుంది. అందులో రాప్తాడు కూడా ఒకటి. నియోజకవర్గంలోని టిడిపి కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించటం గమనార్హం.

ఇక, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎంఎల్సీ కందుల దుర్గేష్ వైసీపీలో చేరారు. మొన్నటి ఎన్నికల్లో పై జిల్లాలో టిడిపి మెజారిటీ నియోజకవర్గాలను గెలుచుకున్నది. వైసీపీ తరపున గెలిచిన జ్యోతుల నెహ్రూ, పరుపుల సుబ్బారావు టిడిపిలో చేరారు.

దాంతో పలు నియోజకవర్గాల్లో వైసీపీని బలోపేతం చేయాల్సిన అవసరం వచ్చింది. దాంతో మిత్రపక్షాలతో పాటు ప్రతిపక్షాలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని వైసీపీలోకి చేర్చుకునే విషయమై జగన్ దృష్టి పెట్టినట్లు స్పష్టమవుతోంది.