చంద్రబాబునాయుడు తన కుటుంబసభ్యులతో కలిసి రాష్ట్రంలోని మహిళలకు క్షమాపణ చెప్పాలంటూ వైసిపి డిమాండ్ చేసింది. ఇంతకీ కుటుంబసభ్యులతో కలిసి చంద్రబాబు ఎందుకు మహిళలకు క్షమాపణ చెప్పాలి? వైసిపి అధికార ప్రతినిది వాసిరెడ్డి పద్మ గురువారం మీడియాతో మట్లాడుతూ, చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో ఓ మహిళను కొందరు టిడిపి కార్యకర్తలు బట్టలూడదీసినందుకట.

బుధవారం ఉదయం కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలోని గుంజార్లపల్లిలో ఇద్దరు మహిళలకు ఎప్పటి నుండో కక్షలున్నాయి. దానికితోడు ఇద్దరూ టిడిపి, వైసిపిలకు చెందిన సానుభూతిపరులు. టిడిపికి చెందిన భాగ్యలక్ష్మిపై  వైసిపికి చెందిన ఉమ జన్మభూమి కార్యక్రమంలో ఫిర్యాదు చేసింది. దాన్ని మనసులో పెట్టుకున్న భాగ్యలక్ష్మి దంపతులు బుధవారం ఉదయం ఉమ ఒంటరిగా దొరకటంతో మీద పడేసి కొట్టారు. అంతేకాకుండా నడిరోడ్డులో బట్టలూడదీసేసారు.

జరిగిన ఘటనపై పోలీస్టేషన్లో ఉమ దంపతులు ఫిర్యాదు చేసినా పెద్దగా పట్టించుకోలేదు. ఆ విషయంపైనే వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. మహిళలపై అఘాయిత్యాలు జరిగినా, దాడులు చేసినా చివరకు బట్టలిప్పేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోదా అంటూ ధ్వజమెత్తారు. ఇంకా ఎంతమంది మహిళలపై టిడిపి నేతలు, కార్యకర్తలు దాడులు చేస్తారంటూ చంద్రబాబు నిలదీసారు.

అసలు రాష్ట్రంలో నడుస్తున్నది నాగరీక ప్రభుత్వమా లేక రాక్షస ప్రభుత్వమా అంటూ మండిపడ్డారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ముఖ్యమంత్రి బార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణితో పాటు మహిళా ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి, డిజిపి భార్య, చిత్తూరు జిల్లా కలెక్టర్ , ఎస్పీల భార్యలను, మహిళా మంత్రులను వైసిపి సూటిగా ప్రశ్నిస్తోందన్నారు. ఇంత జరుగుతున్నా ఎవ్వరూ ఎందుకు నోరు మెదపటం లేదని పద్మ మండిపడ్డారు.

ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే నేషనల్ మీడియా ఏం చేస్తోందంటూ విస్మయం వ్యక్తం చేశారు. ఇంకో ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఇదే విధంగా జరిగితే నేషనల్ మీడియా మౌనంగా ఉంటుందా అంటూ సూటిగా ప్రశ్నించారు. వైసిపికి చెందిన మహాళలపై అధికారపార్టీ కక్షగట్టి ప్రవర్తించటం దారుణమని వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు.