మహిళా వాలంటీర్ పై కౌన్సిలర్ భర్త వేధింపులు... వైసిపి నేతల ఎంట్రీతో చివరకు జరిగిందిదే..!
మహిళా వాలంటీర్ పై వైసిపి కౌన్సిలర్ భర్త వేధింపులకు దిగిన ఘటన కృష్ణా జిల్లా ఉయ్యూరులో వెలుగుచూసింది. బాధిత వాలంటీర్ పోలీసులకు పిర్యాదు చేయగా వైసిపి నాయకుల ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది.

మచిలీపట్నం : జగన్ సర్కార్ ఏర్పాటుచేసిన వాలంటీర్ల వ్యవస్థ మహిళా రక్షణకు విఘాతం కలిగిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిరుపేద యువతులు, ఒంటరి మహిళల వివరాలు వాలంటీర్ల కారణంగా సంఘవిద్రోహ శక్తుల చేతుల్లోకి చేరుతున్నాయని జనసేనాని పవన్ కల్యాణ్ లాంటి వారు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో భారీగా మహిళల మిస్సింగ్ కు కూడా ఇదే కారణమంటూ ఆరోపణలున్నాయి. ఇలాంటి సమయంలో ఓ మహిళా వాలంటీర్ వైసిపి నాయకుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం కృష్ణా జిల్లాలో కలకలం రేపింది.
ఉయ్యూరు నగర పంచాయితీ రెండవ వార్డు వైసిపి మహిళా కౌన్సిలర్ భర్త వణుకూరు సురేష్ తనను వేధిస్తున్నాడని ఓ మహిళా వాలంటీర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం అర్ధరాత్రి వైసిపి నాయకుడిపై వాలంటీర్ ఫిర్యాదు చేయగా శనివారం హైడ్రామా నడిచింది. అధికార పార్టీ నాయకులు రంగంలోకి దిగి వేధింపులు ఎదుర్కొన్న మహిళా వాలంటీర్ తో పాటు ఆమె కుటుంబసభ్యులను రాజీ చేసుకోవాలని ఒత్తిడిచేసారు. దీంతో వాలంటీర్ కుటుంబం వెనక్కి తగ్గడంతో సదరు కౌన్సిలర్ భర్త పోలీస్ కేసు నుండి బయటపడ్డాడు.
వాలంటీర్ ఆరోపణలివే...
ఉయ్యూరు పట్టణంలో వాలంటీర్ గా పనిచేస్తున్న తనను వైసిపి కౌన్సిలర్ భర్త వేధిస్తున్నాడని బాధిత మహిళ ఆరోపిస్తోంది. ఈ ఏడాది మార్చిలో వైసిపి నాయకుడు సురేష్ తన చేయిపట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడని మహిళ పేర్కొంది. అయితే ఈ విషయం బయటపెడితే ఎక్కడ తన కుటుంబం సమస్యల్లో పడుతుందని ఆమె మౌనంగా వుండిపోయింది. దీన్ని ఆసరాగా చేసుకుని అతడు మరింతగా రెచ్చిపోయాడు. వ్యక్తిగతంగానే కాకుండా ఉద్యోగ పరంగా ఇబ్బందిపెడుతూ వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించింది. ఇటీవల కాలంలో అతడి వేధింపులు మరీ ఎక్కువ కావడంతో భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధిత వాలంటీర్ తెలిపింది.
Read More కడుపునిండా భోజనం పెట్టినా.. కనికరం లేకుండా హతమార్చాడు.. సైకో తీరుతో నిట్టూరు గ్రామంలో విషాదం..
తన కుటుంబసభ్యులు కౌన్సిలర్ భర్తను నిలదీయగా అతడి కుటుంబసభ్యులు తమను కులం పేరుతో దూషించారని మహిళా వాలంటీర్ తెలిపారు. దీంతో ఎస్సీ మహిళ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయగా శనివారం పోలీసులు ఇరువర్గాలను పిలిచి విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్న వైసిపి నాయకులు కేసు వరకు వెళ్లకుండా ఇరు వర్గాలకు నచ్చజెప్పారు. దీంతో పిర్యాదు చేసిన మహిళా వాలంటీర్ రాతపూర్వకంగా రాజీ అవుతున్నట్లు తెలిపారని... అందువల్లే ఎలాంటి కేసు నమోదు చేయలేదని ఉయ్యూరు పోలీసులు తెలిపారు.