కడుపునిండా భోజనం పెట్టినా.. కనికరం లేకుండా హతమార్చాడు.. సైకో తీరుతో నిట్టూరు గ్రామంలో విషాదం..
ఆ సైకో కడుపునిండా అన్నం పెట్టారన్న ఉపకారం చూపలేదు. కనికరం లేకుండా దంపతులపై దాడికి ఎగబడి, హతమార్చాడు. అడ్డువచ్చి, నిలువరించేందుకు వచ్చిన వారిపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడిని కూడా గ్రామస్తులు రాళ్లతో కొట్టారు. గాయాలతో ఆ సైకో కూడా మరణించాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

ఆ సైకో చేసిన పని వల్ల అనంతపురం జిల్లా యాడికి మండలం నిట్టూరు గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కడుపు నిండా భోజనం పెట్టారన్న ఉపకారం లేకుండా.. ఇద్దరు దంపతులు ను క్రూరంగా హతమర్చాడు. మరో మహిళపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించాడు. గమనించిన స్థానికులు అతడిని రాళ్లతో కొట్టి చంపారు. దీంతో ఆ మూడు కుటుంబాల్లో తీరని దు:ఖం నెలకొంది.
వివరాలు ఇలా ఉన్నాయి. నిట్టూరు గ్రామంలో 52 ఏళ్ల బాలరాజు, 45 ఏళ్ల సుంకమ్మ దంపతులకు నలుగురు పిల్లలు. ఇందులో ముగ్గురు ఆడపిల్లలు కాగా.. ఒక కుమారుడు ఉన్నారు. ఈ దంపతులు దోబీ పనులు చేస్తూ జీవనం సాగించేవారు. ముగ్గురు ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేసి అత్తగారింటికి పంపించారు. సుదర్శన్ అనే చిన్న కుమారుడు ఐటీఐ పూర్తి చేసి స్థానికంగా ఉన్న పెట్రోల్ బంక్ లో పని చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. బలరాజుది చాలా మంచి మనస్థత్వం. గ్రామంలో చాలా మంచి పేరుంది. ఎవరితో గొడవలకు వెళ్లేవాడు కాదు. కుమారుడి పెళ్లి చేసి విశ్రాంతి తీసుకుందామని ఆ దంపతులు భావిస్తున్న తరుణంలోనే తీరని విషాదం నెలకొంది.
ఈ దంపతులకు సమీప బంధువైన 32 ఏళ్ల ప్రసాద్ కు మతిస్థిమితం సరిగా లేదు. శుక్రవారం రాత్రి అతడు బాలరాజు ఇంటికి మద్యం తాగి వచ్చాడు. దీంతో ఆ దంపతులు అతడికి కడుపు నిండా అన్నం పెట్టారు. తండ్రితో గొడవలు పెట్టుకోవద్దని, ప్రశాంతంగా జీవించాలని సూచించారు. భార్య పిల్లలను మంచిగా చూసుకోవాలని హితవు పలికారు. నాలుగు మంచి మాటలు చెప్పారు. అప్పుడు వాటిన్నంటికి సరే అన్న ఆ సైకో ఆ దంపతులు పడుకున్న తరువాత తన ఉగ్రరూపం చూపెట్టాడు. నిద్రిస్తున్న బాలరాజు, సుంకమ్మ దంపతులుపై అర్థరాత్రి సమయంలో కొడవలితో దారుణంగా హతమర్చాడు. దీంతో తీవ్ర గాయాలతో వారు అక్కడే మరణించారు.
దీనిని బాలరాజుకు కూతురు వరుస అయ్యే పక్కింటి మహళపై కూడా ఆ సైకో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆమె ఇంట్లోకి పరిగెత్తింది. భయంతో తలుపులు వేసుకుంది. ఆమె కేకలు వేయడంతో గ్రామస్తులు నిద్రలో నుంచి లేచారు. ఆ సైకోను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే.. వారిపై కూడా కొడవలితో దాడి చేశాడు. ఈ క్రమంలో బాలరాజు తమ్ముడు ఈశ్వరయ్య గాయపడ్డాడు. దీంతో గ్రామస్తులు ఆగ్రహంతో అతడిని రాళ్లతో కొట్టారు. గాయాలతో అతడు మరణించాడు.
అనంతరం మూడు మూడు మృతదేహాలను తాడిపత్రి గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకొచ్చారు. బాధిత కుటుంబ సభ్యులతో పాటు ఆ గ్రామస్తులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడి వచ్చారు. తీవ్రంగా రోదించారు. కాగా.. ఈ ఘటనలో పోలీసులు అప్రమత్తమయ్యారు. డీఎస్పీ గంగయ్య, సీఐ శంకర్ రెడ్డి, స్థానిక మండలాల ఎస్ ఐలు అక్కడికి చేరుకున్నారు. గ్రామంలో బందోబస్తు కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.