నవరత్నాలతో సామాజిక న్యాయం, సాధికారిత అమలు: జయహో బీసీ మహాసభలో జగన్
సామాజిక న్యాయానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. విజయవాడలో నిర్వహించిన జయహో బీసీ సభలో తమ ప్రభుత్వం మూడున్నరఏళ్లుగా చేపట్టిన కార్యక్రమాల గురించి ఆయన వివరించారు.
విజయవాడ: ప్రతి గడపకు సామాజిక న్యాయం, సాధికారితను నవరత్నాల ద్వారా అమలు చేస్తున్నామని అని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. విజయవాడలో బుధవారంనాడు నిర్వహించిన జయహో బీసీ మహాసభలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. సామాజిక న్యాయానికి తాము కట్టుబడి ఉన్నట్టుగా ఆయన వివరించారు. తమ ప్రభుత్వ ప్రతి అడుగులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.తన మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 70 శాతం ప్రాతినిథ్యం కల్పించామన్నారు.ఐదుగురు డిప్యూటీ సీఎంలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలేనని సీఎం జగన్ చెప్పారు. చరిత్రలో ఏనాడూ లేని విధంగా అడుగులు వేసినట్టుగా జగన్ తెలిపారు. డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా మూడున్నరఏళ్లలో రూ. 3.19 లక్షల కోట్లకు పైగా లబ్ది పొందారని సీఎం వివరించారు.
చంద్రబాబునాయుడు 2014-19 కాలంలో ఏ ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదన్నారు. తమ ప్రభుత్వం మూడున్నర ఏళ్లలో రాజ్యసభకు పంపిన ఎనిమిది మందిలో నలుగురు బీసీలేనని జగన్ గుర్తు చేశారు. సంక్షేమ పథకాల్లో పేద సామాజిక వర్గాలకే పెద్దపీట వేశామన్నారు.చంద్రబాబు పాలనలో అదే బడ్జెట్ తన పాలనలో అదే బడ్జెట్ అని జగన్ గుర్తు చేశారు. అప్పుల్లో పెరుగుదల రేటు చంద్రబాబు ప్రభుత్వంలో కన్నా ఇప్పుడే తక్కువగా ఉందని సీఎం జగన్ వివరించారు. చంద్రబాబు హయంలో పథకాలు ఎందుకు లేవో ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు. చంద్రబాబు సర్కార్ లో నలుగురు మాత్రమే బడ్జెట్ ను పంచుకొనేవారని జగన్ ఆరోపించారు. దోచుకో.. పంచుకో.. తినుకో అనేదే చంద్రబాబు విధానమని జగన్ విమర్శించారు. అందుకే ఎలాంటి పథకాలను చంద్రబాబు తీసుకురాలేదని జగన్ విమర్శించారు. ఎస్సీల్లో ఎవరైనా పుడతారా అని చంద్రబాబు హేళన చేశారన్నారు. కానీ తాను మాత్రం కేబినెట్ లో 56 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీలకు స్థానం కల్పించినట్టుగా చెప్పారు. .మంత్రి వర్గ విస్తరణలో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనారిటీలేనని ఆయన గుర్తు చేశారు. తన మంత్రివర్గంలో ఉన్న 25 మంది మంత్రుల్లో 11 మంది బీసీలే ఉన్నారని సీఎం వివరించారు.
also read:2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలు: విజయవాడ జయహో బీసీ సభలో జగన్
గ్రామ సచివాలయాల్లో లక్షా 30 వేల ఉద్యోగుల్లో 84 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలేనని సీఎం జగన్ చెప్పారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇచ్చిన ఇళ్లపట్టాల్లో 84 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలేనని సీఎం జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. శాసనమండలిలోని 32 మంది వైసీపీ సభ్యుల్లో మెజారిటీ బీసీలేనని సీఎం జగన్ తెలిపారు.వైఎస్ఆర్ చేయూత ద్వారా రూ. 14, 110 కోట్లు లబ్దిదారులకు అందించామన్నారు. వైఎస్ఆర్ ఆసరా ద్వారా బీసీ, ఎస్సీ,ఎస్టీ మైనారిటీలకు రూ. 9294 కోట్లు అందించినట్టుగా సీఎం జగన్ గుర్తు చేశారు.డ్వాక్రా మహిళలకు రూ. 3615 కోట్ల నిధులను అందించినట్టుగా సీఎం జగన్ వివరించారు. ప్రతి పేద విద్యార్ధికి ఇంగ్లీష్ విద్యను అందుబాటులోకి తీసుకువచ్చినట్టుగా సీఎం చెప్పారు.అమ్మఒడి పథకంతో రూ.15,378 కోట్లను అందించడంతో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ప్రయోజనం దక్కిందని సీఎం అభిప్రాయపడ్డారు.