అధికార వైసిపి పార్టీకి చెందిన మహిళా కార్పోరేటర్ భర్త తను అనుచరులతో కలిసి ఓ ట్రావెల్స్ ఏజెన్సీపై దౌర్జన్యానికి దిగుతూ సిబ్బందిపై దాడికి పాల్పడిన ఘటన ఏలూరు నగరంలో చోటుచేసుకుంది. 

ఏలూరు: ఆంధ్ర ప్రదేశ్ లో రౌడీ షీటర్ల అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. అధికార పార్టీ అండదండలతో కొందరు రౌడీషీటర్లయితే చిన్నచిన్న విషయాలకే ఓవర్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇలా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో బస్సు ఆపలేదని ఓ రౌడీ షీటర్ ట్రావెల్స్ ఆపీస్ పై దాడిచేసి సిబ్బందిని చితకబాదారు. ఈ ఘటన గత రాత్రి చోటుచేసుకోగా దాడికి సంబంధించిన సిసి ఫుటేజి బయటకు రావడంతో వైసిపి మహిళా కార్పోరేటర్ భర్త అరాచకం వెలుగులోకి వచ్చింది.

ఏలూరు (eluru) పట్టణానికి చెందిన భీమవరపు సురేష్‌-హేమసుందరి భార్యాభర్తలు. సురేష్ సెటిల్ మెంట్లు, భూకబ్జాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటాడని చెడ్డపేరు వుంది. అయితే అతడు ఇటీవలే తన భార్య హేమసుందరిని రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో హేమసుందరి అధికార వైసిపి పార్టీ నుండి కార్పోరేటర్ (ysrcp corporator) గా పోటీచేసి గెలుపొందారు. భార్య గెలుపు తర్వాత సురేష్ ఆగడాలు మరీ మితిమీరిపోయాయి. 

Video

ఇటీవల ఏలూరుకు చెందిన ఓ డాక్టర్ కు చెందిన కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కబ్జా చేయడానికి సురేష్ యత్నించినట్లు సమాచారం. సదరు డాక్టర్ ఏలూరు టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సురేష్ పై కేసు నమోదయ్యింది. 

ఇలా సురేష్ తో పాటు అతడి అనుచరులు నగరంలో హల్ చేస్తున్నారు. తాజాగా సురేష్ ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో వెళ్లడానికి టికెట్లు బుక్ చేసుకున్నాడు. గురువారం భార్య హేమసుందరితో కలిసి బస్సెక్కడానికి ట్రావెల్స్ ఆఫీస్ వద్దకు వచ్చారు. అయితే వారు కాస్త ఆలస్యం రావడంతో అప్పటికే బస్సు వెళ్లిపోయింది. అయితే ఆ బస్సును వెనక్కి రప్పించి తమను తీసుకుని వెళ్లాల్సిందిగా చెప్పాలని ట్రావెల్ సిబ్బందిని సురేష్ తో పాటు ఆయన అనుచరులు కోరారు. అలా చేస్తే మిగతా ప్రయాణికులు ఇబ్బంది పడతారని... మీరు మరో బస్సులో వెళ్లే ఏర్పాటు చేస్తామని ట్రావెల్స్ ఏజెన్సీ సిబ్బంది వారితో చెప్పారు.

మీకోసం బస్సు వెనక్కి రప్పించడం కుదరదని చెప్పడంతో సురేష్ ఈగో హర్ట్ అయినట్లుంది. దీంతో అనుచరులతో కలిసి సురేష్ ట్రావెల్స్ ఆఫీస్ పై దాడి చేసి సిబ్బందిని చితకబాదారు. కార్పోరేటర్ హేమసుందరి ఎదుటే ట్రావెల్స్ సిబ్బందిపై పైశాచికంగా దాడికి పాల్పడ్డారు. తాము దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేస్తే మళ్లీ వచ్చి కొడతామని బెదిరించి అక్కడినుండి వెళ్లిపోయారు. అయితే ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు ట్రావెల్స్ ఆఫీస్ సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. 

యాజమాన్యం సూచనలతో తమపై జరిగిన దాడి గురించి ట్రావెల్స్ సిబ్బంది ఏలూరు త్రీటౌన్ పోలీసులకు పిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడి దృశ్యాలకు సంబంధించిన సిసి ఫుటేజిని స్వాధీనం చేసుకున్నారు.

గతంలో కూడా ఇలాంటి అనేక ఘటనలు చోటుచేసుకున్నా పోలీసులు చూసిచూడనట్లు వ్యవహరిస్తుండటంతో రౌడీషీటర్లు రెచ్చిపోతున్నారని ఏలూరు వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికయినా పోలీసులు రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపి శాంతిభద్రతలను కాపాడాలని కోరుతున్నారు.