విజయవాడలోని గౌతమ్ రెడ్డి విషయంలో వైసిపి స్పష్టత ఇచ్చింది. వంగవీటి రంగా, రాధా విషయంలో ఆమధ్య గౌతమ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసలే విజయవాడలో వంగవీటి రంగా అంటే విపరీతమైన క్రేజ్.  కాపు సామాజికవర్గానికి చెందిన వంగవీటి రంగా మృతిచెంది సుమారు 30 ఏళ్ళయినా ఇప్పటికీ అదే క్రేజ్ మైన్ టైన్ అవుతోంది. దానికితోడు రంగా కొడుకు వంగవీటి రాధాకృష్ణ విజయవాడలోని వైసిపి ప్రముఖ నేతల్లో ఒకరు. అటువంటిది గౌతమ్ వంగవీటి రంగాపై చేసిన వ్యాఖ్యలతో ఆరోజు విజయవాడలో పెల్ల కలకలమే రేగింది.

అసలే ఎన్నికల కాలం. దాంతో వైసిపి నాయకత్వం ముందుగా మేల్కొని గౌతమ్ ను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. అయితే, గౌతమ్ మాత్రం తాను వైసిపి నేతగానే చెలామణి అవుతున్నారు. పైగా తనను పార్టీ సస్పెండ్ చేయలేదని బాహాటంగానే చెప్పుకుని తిరుగుతున్నారు.

టివి చర్చల్లో కూడా వైసిపి నేతగానే చెలామణి అవుతున్నారు. దాంతో జరగబోయే డ్యామేజిని గుర్తించిన వైసిపి నాయకత్వం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. గౌతమ్ రెడ్డికి వైసిపికి సంబంధం లేదని చెప్పింది. గౌతమ్ ను పార్టీ నుండి ఎప్పుడో సస్పెండ్ చేసినట్లు స్పష్టం చేసింది. ఎవరు ఆయన్ను వైసిపి నేతగా పరిగణించవద్దంటూ విజ్ఞప్తి చేసింది. జాతీయ ప్రధానకార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి పేరుతో ప్రకటన విడుదలైంది.