కొండవీడులో ముఖ్యమంత్రి సభా ప్రాంగణానికి సమీపంలో రైతు ఆత్మహత్యకు కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్. ‘‘కొండవీడులో ఒక బీసీ రైతు కోటయ్య గారిని మీరే చంపేశారు ముఖ్యమంత్రి గారు.. కొట్టి కొనఊపిరితో ఉన్న రైతులను అమానుషంగా అక్కడే వదిలేశారు.

మీ హెలికాఫ్టర్ దిగటానికి ఆయన బొప్పాయి పొలాన్ని నాశనం చేశారు. మానవత్వం చూపాల్సిన సందర్భాల్లో ఈ రాక్షసత్వం ఏమిటీ’’ అంటూ జగన్ ట్వీట్ చేశారు. చారిత్రాత్మక కొండవీడు కోటలో ఉత్సవాలకు ముఖ్యమంత్రి వస్తుండటంతో భద్రతా సిబ్బంది కఠిన చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలో సభ పేరుతో కాపుకొచ్చిన తన పండ్ల తోటను నాశనం చేయడమే కాకుండా, పొలంలోకి వెళ్లకుండా తనను పోలీసులు అడ్డుకున్నారంటూ కోటయ్య అనే రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు.

అయితే కొనఊపిరితో ఉన్న రైతును ఆసుతప్రికి తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ.. అదే సమయంలో ముఖ్యమంత్రి వస్తుండటంతో పోలీసులు అడ్డుకున్నట్లుగా సమాచారం. దీంతో చేసేది లేక కోటయ్యను గ్రామస్తులు చేతులపైనే మోసుకెళ్లారు.

అయితే మార్గమధ్యంలోనే కోటయ్య ప్రాణాలు కోల్పోయాడు. కాగా రైతు మరణవార్తను తెలుసుకున్న సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశాడు. పోలీసుల తీరుతోనా లేక ఇతర కారణాలతో కోటయ్య ఆత్మహత్యకు పాల్పడ్డారా..? లేక మరేదైనా కారణం ఉందా అన్నది తేల్చాల్సిందిగా ఆదేశించారు.

ఆయన ఆత్మ శాంతించాల్సిందిగా 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం కోటయ్య కుటుంబానికి రూ.5 లక్షల ఆర్ధిక సాయాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు.