గుంటూరు: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయడానికి ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంట్లో భాగంగా జిల్లాల వారీగా పార్టీ బాధ్యతలను ముగ్గురు కీలక నేతలకు అప్పగించారు. అయితే జిల్లాల బాధ్యతలను కేవలం రెడ్డి సామాజిక వర్గానికి(విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి) అప్పగించడంతో ప్రతిపక్ష నాయకులు జగన్ పై విరుచుకుపడుతున్నారు. ఇదేనా మీ సామాజిక న్యాయం అంటూ టిడిపి నాయకులు జగన్ ను  ప్రశ్నిస్తున్నారు. 

''జగన్ రెడ్డి గారి సామాజిక అన్యాయం.ఇత‌ర కులాల్ని చూడరు.ఇత‌ర మ‌తాల్ని ప‌ట్టించుకోరు. ఉత్తరాంధ్ర-విజయసాయిరెడ్డి, రాయలసీమ-సజ్జల రామ‌కృష్ణారెడ్డి,కోస్తాంధ్ర-వైవీ సుబ్బా రెడ్డి, ఇంత‌కంటే ఎవ్వ‌రైనా సామాజిక అన్యాయం చేయ‌గ‌ల‌రా?'' అని ట్విట్టర్ వేదికన జగన్ నిర్ణయాన్ని ఎద్దేవా చేశారు టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. 

''సామాజిక అన్యాయం లో జగన్ రెడ్డి గారు నెంబర్ 1.పాదయాత్ర లో కనిపించిన సామజిక న్యాయం ఇప్పుడు కనుచూపు మేర లో కనపడటం లేదు. ఉత్తరాంధ్ర-విజయసాయిరెడ్డి, రాయలసీమ-సజ్జల రామ‌కృష్ణారెడ్డి,కోస్తాంధ్ర-వైవీ సుబ్బా రెడ్డి. రాజారెడ్డి రాజ్యాంగంలో సామాజిక న్యాయం అంటే రాజ్యాన్ని బంధువర్గానికి సమానంగా పంచడమే''  అని టిడిపి అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. 

''ప్ర‌జ‌లు ఎన్నుకున్న ముఖ్య‌మంత్రిని అని మ‌రిచిపోయిన జ‌గ‌న్‌రెడ్డి, ఈ రాజ్యానికి రాజుని అనుకుంటున్నారు. ఉత్త‌రాంధ్ర‌, కోస్తాంధ్ర‌, రాయ‌ల‌సీమ‌ల‌కి బంధువులైన విజ‌య‌సాయిరెడ్డి, స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి సామంత‌రాజులుగా ఎంపిక చేశారు. జ‌గ‌న్‌రెడ్డిరాజ్యంలో సామాజిక‌న్యాయం గురించి మాట్లాడ‌టం మాని, క‌ప్పంక‌ట్టి బ‌త‌కాల్సిందే!'' అంటూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు  ట్విట్టర్ వేదికన జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. 

read more అలాంటి వారిని చూసిన దేశంలో ఇలాంటి స్పీకరా..: తమ్మినేనిపై ఎమ్మెల్సీల ఆగ్రహం

రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల, వైవీ సుబ్బారెడ్డికి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల, సజ్జల రామకృష్ణారెడ్డికి కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పార్టీ బాధ్యతలను అప్పగించారు ముఖ్యమంత్రి జగన్. ఈ ముగ్గురు రాష్ట్రంలోని మొత్తం జిల్లాల పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. 

అంతేకాకుండా తాడేపల్లిలో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయ సమన్వయ బాధ్యతలను కూడా సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకోగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం వైవి సుబ్బారెడ్డి టిటిడి పాలకమండలి అధ్యక్షుడిగా, విజయసాయి ఎంపీగా, సజ్జల ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నారు.