చంద్రబాబునాయుడుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సవాలు విసిరారు. నంద్యాల ఉపఎన్నిక ఫలితంపై మీడియాతో జగన్ సోమవారం స్పందించారు. జగన్ మాట్లాడుతూ, వైసీపీ గుర్తుపై గెలిచిన మిగిలిన 20 మంది ఎంఎల్ఏలను రాజీనామా చేయించి గెలిపించుకోవాలని సవాలు విసిరారు. ఒక్క నంద్యాల ఉపఎన్నికలో గెలిచినంత మాత్రాన గొప్పకాదన్నారు. ఒక సెగ్మెంట్లో రూ. 200 కోట్లు ఖర్చుపెట్టి, పోలీసులను, అధికారులను భయబ్రాంతులకు గురిచేసి మొత్తం నియోజకవర్గాన్ని గుప్పిట్లో పెట్టుకుని ‘ఇదే గెలుపంటే ఎలా’ అంటూ ఎద్దేవా చేసారు.

‘చంద్రబాబుకు దమ్ముంటే 20 మంది ఎంఎల్ఏల చేత రాజీనామా చేయించమనండి చూద్దాం, రెఫరెండమంటే అది’ అంటూ సవాలు విసిరారు. ఒకేసారి 20 నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు ఎదుర్కొనేందుకు చంద్రబాబు ధైర్యముందా అంటూ ప్రశ్నించారు. నంద్యాలలో రాజకీయం చేసినట్లు కాదు 20 నియోజకవర్గాల్లో ఎన్నికలను ఎదుర్కోవటం అని ఎద్దేవా చేసారు. నంద్యాలలో పంచినట్లు 20 నియోజకవర్గాల్లో రూ. 4000 కోట్లు పంచగలరా? అధికారులను భయబ్రాంతులకు గురిచేయగలరా? అంటూ ప్రశ్నించారు.

ఓట్లేసిన ప్రజలకు, అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు చక్రపాణిరెడ్డికి కూడా జగన్ హ్యాట్సాఫ్ చెప్పారు. దీన్ని ఓ విజయంగా చంద్రబాబు భావిస్తే దిగజారుడు రాజకీయమని వర్ణించారు. ఇదే గొప్ప విజయమని అనుకుంటే చంద్రబాబుకన్నా మూర్ఖుడు ప్రపంచంలో ఇంకోరుండరని చెప్పారు.