తెలుగు దేశం ‘జాబ్ లెస్’ పరిపాలన అని చెప్పేందుకు  ప్రతిపక్ష వైసిపి కొత్త నినాదం రూపొందించింది. గత మూడున్నరేళ్లలో తెలుగుదేశం పరిపాలనలో ఉద్యోగాలేవీ రాలేదు.ఇది నిరుద్యోగుల్లో ఆందోళన కలిగిస్తూ ఉంది. పార్టీ అధినేత జగన్ జరిపిన జిల్లా యువభేరీలలో యువకులు తమ దీని పరిస్థితి ఎలా ఉందో వివరిస్తూ వచ్చారు.  ఆరు లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయులు,కోటి ఉద్యోగాలన్నాను. అలాంటి మ్యాజిక్ మూడేళ్లు దాటినా ఎక్కడా కనిపించలేదు. 2014లో చంద్రబాబు నాయుడు –జాబు కావాలంటే, బాబు రావాలి’ అని ఒక నినాదం పడేసి యువకులను ఆకట్టుకున్నారు. ఇపుడు అదే యువకుల నిరాశలో పడిపోయారు. ఈ పరిస్థితికి అద్దంపట్టేలా ఈ కొత్త నినాదం ఉంది. ‘జాబు రావాలంటే బాబు పోవాలి’ అని  వైసిపి మహిళా విభాగం అధ్యక్షురాలు, నగరి ‘ఫైర్ బ్రాండ్ ’ ఎమ్మెల్యే  ఆర్ కె రోజా నినాదం ఇచ్చారు.

ఉద్యోగాల భర్తీ చేయలేకపోవడం, అట్టహాసంగా ప్రకటించిన నిరుద్యోగ భృతి అతీగతీ లేకపోవడానికి నిరసన తెలుపుతూ చెవిలో పూలుపెట్టుకుని ఆమె పుత్తూరు  పట్టణంలోని ఆరేటమ్మ ఆలయం నుంచి అంబేడ్కర్‌ సర్కిల్‌ వరకు బుధవారం ర్యాలీ నిర్వహించారు.

ఇంటికో ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి అని చంద్రబాబు 2014 ఎన్నికలపుడు ఇచ్చిన హామీ గుర్తు చేస్తూ మూడున్నరేళ్లయినా ఈ రెండుహామీలను అమలుచేయకపోవడం నిరుద్యోగులనుమోసం చేయడం కాదా అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఉద్యోగాలొచ్చింది ముఖ్యమంత్రి కొడుక్కి, పార్టీలు మారిన ఎమ్మెల్యేలకే నని ఆమె ఎగతాళి చేశారు. ఇది అబద్దమా అని ప్రశ్నించారు.

చిత్తూరు జిల్లా గురించి మాట్లాడుతూ జిల్లాను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, అమర్‌నాధ్‌రెడ్డిలు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ జిల్లా యువతకు ఉద్యోగాలు కల్పించలేకపోవడం  అసమర్థత కాక ఏమవుతుందని అన్నారు.

‘రాష్ట్రంలో 1.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలున్నాయి.వాటిని భర్తీ చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు కాలయాపన చేస్తూ యువతకు అన్యాయం చేస్తున్నారు.. కొత్తగా ఉద్యోగాలు కల్పించకపోగా సుమారు 25 వేల కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించి వారి కుటుంబాలను వీధిన పడేశారు. ప్రత్యేక హోదా డిమాండ్ ని ఓటుకు నోటు కేసుతో తాకట్టు పెట్టి నిరుద్యోగ యువకుల ద్రోహం చేశారు. అందువల్ల ఆంధ్రలో జాబు రావాలంటే బాబు పోవాలి,’ అని పిలుపునిచ్చారు. లోకేష్‌కు జాబ్‌ వస్తే సరిపోతుందా, రాష్ట్రంలెని
నిరుద్యోగులకు జాబ్‌ అవసరంలేదా అని పార్టీ యువజన విభాగం రాష్ట్ర అథ్యక్షుడు జక్కంపూడి రాజాప్రశ్నించారు. అంతకుమునుపు నిరుద్యోగులను వంచించిన రాష్ట్ర ప్రభుత్వంపై అంబేద్కర్‌ విగ్రహానికి చార్జ్ షీట్ సమర్పించారు.