Asianet News TeluguAsianet News Telugu

విజయమ్మతో గుర్నాధ్ రెడ్డి భేటి

  • వైసిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో అనంతపురం వైసిపి నేత గుర్నాధరెడ్డి భేటీ సంచలనంగా మారింది.
YCP Ananta brothers wavering on joining TDP

వైసిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో అనంతపురం వైసిపి నేత గుర్నాధరెడ్డి భేటీ సంచలనంగా మారింది. గుర్నాధరెడ్డి టిడిపిలో చేరబోతున్నారంటూ చాలా కాలంగా ప్రచారంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, కారణాలు స్పష్టంగా తెలియటం లేదు కానీ టిడిపిలో చేరిక మాత్రం ఆలస్యమవుతోందన్నది వాస్తవం. గుర్నాధరెడ్డిని పార్టీలోకి లాక్కోవటం ద్వారా జగన్ కు పెద్ద షాక్ ఇద్దామని టిడిపి నేతలు పెద్ద ప్లానే వేశారు. అయితే, చేరికలో జాప్యం జరుగుతుండటంతో టిడిపిలో నేతల్లో ఆందోళన కనబడుతోంది

అదే సమయంలో గుర్నాధ్ పార్టీని వదిలి వెళ్ళటం వైసిపిలోని చాలా మంది నేతలకు ఇష్టంలేదు. ఎందుకంటే, గుర్నాధ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తో పాటు విజయమ్మకు బాగా నమ్మినబంటవ్వటమే కారణం. అయితే, జగన్-గుర్నాధ్ మధ్య ఏం జరిగిందన్నది ఎవరికీ తెలీక పోయినా గుర్నాధ్ కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నది మాత్రం వాస్తవం. గుర్నాధ్ లోని అసంతృప్తిని గుర్తించిన టిడిపి నేతలు వల విసిరారు. అప్పట్లో టిడిపిలో చేరటానికి మొగ్గుచూపటంతో ఇంకేముంది జగన్ కు పెద్ద షాకే అంటూ అప్పట్లో కథనాలు రాయించుకున్నారు.

ఇదిలావుంటే, గుర్నాధరెడ్డి టిడిపిలో చేరితే ఎక్కడ ఎకామిడేట్ చేయాలో అర్ధం కావటం లేదు. ఎందుకంటే, అనంతపురం మాజీ ఎంఎల్ఏ అయిన గుర్నాధ్ మళ్ళీ అనంతపురం నుండే పోటీ చేయాలని అనుకుంటున్నారు. అయితే, ప్రస్తుతం టిడిపి తరపున ప్రభాకర్ చౌదరి ఎంఎల్ఏగా ఉన్నారు. గుర్నాధ్ టిడిపిలోకి వస్తే మరి ప్రభాకర్ పరిస్ధితేంటి? అందుకనే గుర్నాధ్ చేరికను ప్రభాకర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభాకర్ కు మంత్రి పరిటాలసునీత తదితరులు మద్దతుగా నిలబడ్డారట. దాంతో ఏం చేయాలో చంద్రబాబుకూ తోచటం లేదు.

ఈనేపధ్యంలో గుర్నాధ్ రెడ్డి హైదరాబాద్ లో విజయమ్మను కలిసారట. ఎందుకు కలిసారు, ఏం చర్చించారన్న విషయంలో మాత్రం స్పష్టత లేదు. పార్టీలో తన భవిష్యత్తుపైనే చర్చలు జరిగి ఉంటాయని పార్టీ వర్గాలంటున్నాయి. అదే సమయంలో ఈనెల 27వ తేదీన కానీ లేకపోతే వచ్చేనెల 5న గాని గుర్నాధ్ పార్టీలో చేరుతున్నారంటూ టిడిపి నేతలంటున్నారు. 5వ తేదీ ముహూర్తం ఏంటంటే, పాదయాత్రలో భాగంగా జగన్ అనంతపురం జిల్లాలోకి అడుగుపెడుతున్నారు. మొత్తానికి గుర్నాధ రెడ్డి విషయంలో రెండు పార్టీల వాళ్ళు ఎవరికి వాళ్ళు ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తుండటం గమనార్హం.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios