అమెరికా నుంచి తీసుకొచ్చి తనను జగన్ క్రాస్ రోడ్డులో నిలబెడతారని అనుకోవడం లేదన్నారు యార్లగడ్డ వెంకట్రావ్. గన్నవరం సీటు వేరే వారికి ఇచ్చామని ఇంకా ప్రకటన చేయలేదని వెంకట్రావ్ అంటున్నారు.

కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఎప్పటి నుంచో వైసీపీలో వున్న యార్లగడ్డ వెంకట్రావ్, దుట్టా నాగేశ్వరరావు వర్గాలకు.. టీడీపీ నుంచి అధికార పార్టీలోకి వచ్చిన వల్లభనేని వంశీమోహన్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. పలుమార్లు నేతలు రోడ్డెక్కడంతో తాడేపల్లిలో అధిష్టానం అందరికీ తలంటు పోసింది. తాజాగా వచ్చే ఎన్నికలకు సంబంధించి యార్లగడ్డ వెంకట్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా నుంచి తీసుకొచ్చి తనను జగన్ క్రాస్ రోడ్డులో నిలబెడతారని అనుకోవడం లేదన్నారు. జగన్ అన్యాయం చేస్తారని అనుకోవడం లేదని.. గన్నవరం సీటు వేరే వారికి ఇచ్చామని ఇంకా ప్రకటన చేయలేదని వెంకట్రావ్ అంటున్నారు. 

జగన్ పెనమలూరు నుంచి అసెంబ్లీకి పంపుతానంటేనే తాను అమెరికా నుంచి భారత్‌కు వచ్చానని యార్లగడ్డ అన్నారు. తర్వాత గన్నవరం నుంచి పోటీ చేయాల్సిందిగా ఆదేశించడంతో అక్కడ ఎన్నికల్లో పోటీ చేశానని వెంకట్రావ్ పేర్కొన్నారు. దొంగ ఇళ్ల పట్టాలు, రిగ్గింగ్ కారణంగా గత ఎన్నికల్లో తాను ఓటమి పాలయ్యానని.. తాను గెలిచి వుంటే ఈ పరిస్థితి వుండేది కాదని ఆయన స్పష్టం చేశారు. 

ALso Read: వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుండే పోటీ చేస్తా: యార్లగడ్డ వెంకట్ రావు సంచలనం

ఇకపోతే.. తెలుగుదేశంలో తాను చేరుతానంటూ వస్తున్న వార్తలను యార్లగడ్డ వెంకట్రావు ఖండించారు. కొన్ని కారణాలతో తాను గన్నవరంలో రాజకీయాలకు దూరంగా వున్నానని.. అంతేకాని నియోజకవర్గానికి కాదని ఆయన స్పష్టం చేశారు. తాను వైసీపీలోనే వున్నానని.. పార్టీ తరపునే పోటీ చేస్తానని యార్లగడ్డ వెంకట్రావ్ తేల్చిచెప్పారు.