కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీలో చోటు చేసుకున్న వివాదంపై ఆ పార్టీ నేత యార్లగడ్డ వెంకట్రావు స్పందించారు. గన్నవరం వైసీపీలో తనకు ఏ గ్రూపు లేదని ఆయన.. వంశీతో కలిసి పనిచేయనని సీఎం జగన్‌కు తేల్చి చెప్పేశానన్నారు.

వంశీ తనను చాలా విధాలుగా ఇబ్బంది పెట్టారని యార్లగడ్డ విమర్శించారు. వంశీకి వైసీపీ అద్దె ఇల్లు లాంటిదని కానీ వైసీపీ తన పార్టీ అని, తన కార్యకర్తలను వంశీ బెదిరిస్తున్నారని వెంకట్రావు ఆరోపించారు.

వల్లభనేనితో కలిసి పనిచేయటం జరగదని... పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యే, ఓ మంత్రి ఒత్తిడి ఉందంటూ పోలీసులు చెబుతున్నారని... ఎన్నికల సమయంలో వంశీ తమ ఇంటి దగ్గర కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని, తమపై దుర్బాషలాడారని యార్లగడ్డ గుర్తుచేశారు.

కాగా, శనివారం గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలం కాకులపాడులో రైతు భరోసా కేంద్రం శంకుస్థాపన సందర్భంగా వివాదం నెలకొంది. ఎమ్మెల్యే వంశీ, దుట్టా ఎదుటే ఇరు వర్గీయులు బాహాబాహీకి దిగారు. దీంతో కాకులపాడులో ఉద్రిక్తత నెలకొంది.

ఇరువర్గీయుల మధ్య మాటామాట పెరగడంతో అది కాస్త రాళ్లు రువ్వుకునే పరిస్థితికి దారితీసింది. ఈ ఘర్షణలో కొందరికి గాయాలైనట్లు తెలిసింది. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.