టిడిపిని కేంద్రప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయలేదు. నిజంగా యనమల బృందాన్ని కేంద్రం అవమానించినట్లే. ఎందుకంటే, మాట్లాడుకుందామని ఢిల్లీకి పిలిపించి ఎటువంటి హామీ ఇవ్వకుండానే చర్చలు ముగించటంతోనే కేంద్ర వైఖరి తేలిపోయింది. ఆర్ధికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు బృందం సోమవారం హడావుడిగా డిల్లీకి వెళ్ళి జైట్లతో భేటీ అయింది. అసలు మాట్లాడుకుందామని రమ్మని పిలిచిన బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అసలు పత్తానే లేరు. దాంతోనే ఏపి విషయంలో కేంద్రం ఏమాత్రం సీరియస్ గా ఉందో తెలిసిపోయింది.

దాంతో చేసేది లేక యనమల బృందం జైట్లతోనే మాట్లాడింది. రెవిన్యూలోటు భర్తీ గురించి హామీ ఇవ్వలేదు. ప్రత్యకహోదాపై స్పష్టత ఇవ్వలేదు. విభజన హామీలపై తర్వాత మాట్లాడుకుందామన్నారు. పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలపై వాణిజ్యశాఖ మంత్రి సురేష్ ప్రభు మాట్లాడతారని చెప్పి జైట్లీ సమావేశం నుండి వెళ్ళిపోయారు. అంటే ఏ ఒక్క విషయంలో కూడా కేంద్రం నుండి సానుకూలత లేదన్నది తేలిపోయింది.

కేంద్రంపై రాష్ట్రంలో ప్రజలు అంత గుర్రుగా ఉన్నా, మిత్రపక్షం టిడిపి మండిపడుతున్నా ఎందుకు ఖాతరు చేయటం లేదు? అంటే ఇంతకాలం కేంద్రం బ్రహ్మాండమని చంద్రబాబు, కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపిలు ఒకటే ఊదరగొట్టారు కాబట్టి. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సినవి రావటం లేదని వైసిపి, ప్రతిపక్షాలు మండిపడుతుంటే చంద్రబాబు ఎదురుదాడి చేసేవారు. తీరా ఎన్నికలు ముంచుకొస్తున్న కారణంగా జనాల ఆగ్రహం నుండి తాను తప్పించుకునేందుకు చంద్రబాబు కేంద్రంపై మళ్ళిస్తున్నారు.

చంద్రబాబు నిలకడలేని తనమే రాష్ట్రం కొంపముంచుతోంది. కేవలం వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యంగా మూడున్నరేళ్ళు కేంద్రాన్ని విపరీతంగా పొగిడారు. రాష్ట్రానికి కేంద్రం ఏమీ ఇవ్వటం లేదని తేలిపోయినపుడు కూడా నిలదీయలేకపోయారు. అదే కేంద్రానికి బాగా అలుసైపోయింది. రేపటి ఎన్నికల్లో డ్యామేజి ఏమైనా జరుగుతుందనుకుంటే అది బిజెపికన్నా టిడిపికే ఎక్కువన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే రాష్ట్రాన్ని కేంద్రం ఏమాత్రం ఖాతరు చేయటం లేదు.