ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక అవకతవకలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కోరారు. వైసీసీ సర్కార్ రూ. 48 వేల కోట్లను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక అవకతవకలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కోరారు. వైసీసీ సర్కార్ రూ. 48 వేల కోట్లను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం రూ. 1.78 లక్షల కోట్లను ప్రజల కోసం ఖర్చు పెడితే.. రూ. 48వేల కోట్లకు లెక్కల్లేవని అన్నారు. లెక్కలు చెప్పలేకపోతే.. ఎవరి జేబుల్లోకి వెళ్లిందో లెక్క తేల్చాలన్నారు. స్పెషల్ బిల్లుల పేరుతో ఖర్చుపెట్టామని ప్రభుత్వం చెబుతోందన్నారు. స్పెషల్ బిల్లులు అనేవి ట్రెజీ కోడ్‌లోనే లేదన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని ప్రభుత్వ పెద్దలు దిగమింగుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఆర్టికల్ 360 ప్రయోగించి.. ఆర్థిక అత్యవసర స్థితిని ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు.
కేంద్రం ఆదుకోకుంటే రాష్ట్ర పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని యనమల అన్నారు. జగన్ ప్రభుత్వంలో పీఏసీ వ్యవస్థ ఎందుకు సరిగా పని చేయడం లేదని యనమల ప్రశ్నించారు. పీఏసీ జరగనివ్వకుండా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. చట్టాలు చేసే అధికారం లేదని కోర్టులు చెప్పకున్నా.. వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. చట్టాలు చేసే హక్కు చట్టసభలకు లేదని కోర్టు చెప్పలేదని.. మూడు రాజధానుల పైనే చట్టం చేసే అధికారం లేదని మాత్రమే హైకోర్టు చెప్పిందన్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక అప్పులు, అవినీతి తప్ప మరేం జరగలేదని విమర్శించారు. కోర్టుల తీరపులపై చట్టసభల్లో చర్చలు పెడుతున్నారని.. ఉభయ సభలను వైసీపీ సొంతానికి వాడుకుంటున్నట్టుగా కనిపిస్తోందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం.. కోర్టులను, చట్ట సభలను కూడా చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
దాణా స్కామ్‌ను కూడా కాగ్ నివేదికే బయటపెట్టిందని యనమల గుర్తుచేశారు. కాగ్ నివేదిక ఆధారంగానే విచారణ చేశారని.. స్కామ్ జరిగిందని తేల్చారని చెప్పారు. ఏపీలోని రూ. 48 వేల కోట్ల దుర్వినియోగం జరిగిందని కాగ్ నివేదికే బయటపెట్టిందన్నారు. స్పెషల్ బిల్లుల పేరుతో నిధులు మళ్లించేందుకే సీఎఫ్ఎంఎస్ విధానం లోపభూయిష్టం అనే ప్రచారం మొదలు పెట్టారన్నారని యనమల విమర్శించారు.
