గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు మదనపల్లి సబ్ డివిజనల్ అధికారి నోటీసు ఇవ్వడంపై శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఖండించారు. అనుమానాస్పద మరణాలపై దర్యాప్తు చేయాలని కోరడమే ఆయన తప్పా..? అని ప్రశ్నించారు. దోషులను కఠినంగా శిక్షించాలని లేఖ రాయడం నేరమా..? అని అన్నారు. ''మీరు సాక్ష్యాలు ఇవ్వండి, మేము విచారిస్తాం'' అని పోలీసులు అనడం విడ్డూరంగా వుందన్నారు యనమల.

''పుంగనూరులో దళిత యువకుడు ఓం ప్రతాప్ అనుమానాస్పద మృతిపై మీడియాలో కథనాలు వచ్చాయి. వైసిపి నాయకులు వేధింపుల గురించి కూడా వాటిలోనే వచ్చింది. దళిత యువకుడి అనుమానాస్పద మృతిపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిజిపికి లేఖ రాయడం నేరమా..? ప్రధాన ప్రతిపక్ష నేతకు నోటీసులు ఇచ్చిన ఉదంతం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా..? ఎవరికే కష్టం వచ్చినా, ఏ అన్యాయం జరిగినా స్పందించడం ప్రతిపక్షం బాధ్యత. మాజీ ముఖ్యమంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా తన బాధ్యతను నిర్వర్తిస్తే, నోటీసులు ఇవ్వడం కన్నా విచిత్రం మరొకటి లేదు'' అని మండిపడ్డారు. 

read more  దళిత యువకుడు మృతి: చంద్రబాబుకు నోటీసు పంపిన చిత్తూరు పోలీసులు

''విచారణ చేయాల్సిన బాధ్యత, దోషులను పట్టుకుని శిక్షించాల్సిన కర్తవ్యం పోలీసులది.  గతంలో ఇలాగే విశాఖ పర్యటనలోనూ నోటీసు ఇస్తే ఏం జరిగింది..? నోటీసులు ఇవ్వడం ద్వారానో, బెదిరింపుల ద్వారానో, వేధింపుల ద్వారానో ప్రతిపక్షాలకు కళ్లెం వేయాలని అనుకుంటే అది జరగని పని. భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. తన కష్టాన్ని, నష్టాన్ని చెప్పుకునే హక్కు దేశంలో ప్రతి పౌరుడికి ఉంది. అలాంటిది ఆంధ్రప్రదేశ్ లో వ్యక్తి స్వేచ్ఛను, వాక్ స్వాతంత్య్రాన్ని కాలరాయడం దారుణం'' అన్నారు. 

''వైసిపి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దళితులపై దాడులు, బిసిలపై తప్పుడు కేసులు, ముస్లిం మైనారిటీలను ఊళ్లలోనుంచి వెళ్లగొట్టడం, గిరిజన మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయి. దోషులను పట్టుకుని కఠినంగా చర్యలు తీసుకోకుండా, వాటి గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేసేవారిపై, లేఖలు రాసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పడం, సిఆర్‌పిసి91 నోటీసులు ఇవ్వడం విడ్డూరంగా ఉంది'' అని విరుచుకుపడ్డారు.

''ప్రతిపక్షాల నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలు, జర్నలిస్ట్ లకు నోటీసులు పంపడమే పనిగా పెట్టుకోవడం సరికాదు. బడుగు బలహీన వర్గాల ప్రజలపై దాడులకు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించడం ద్వారా అరాచక శక్తుల ఆగడాలకు కళ్లెం వేయాలి'' అని యనమల వైసిపి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.