గుంటూరు:  కరోనా  వైరస్ నిరోధానికి వైసిపి ప్రభుత్వం చేపట్టిన చర్యలపై టిడిపి నాయకులు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రం ఇంత విపత్కర పరిస్థితులను  ఎదుర్కొంటున్నా ముఖ్యమంత్రి మాత్రం కేవలం తన రాజకీయాల గురించే ఆలోచిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వమే ఇక రాష్ట్ర ప్రజలను కాపాడాలని... ఈ ప్రభుత్వం వల్ల అది కాదని అన్నారు. 

''వైఎస్  జగన్ గారిది క్రూరమైన మనస్తత్వం. అడ్డదారిలో స్థానిక సంస్థలు కైవసం చేసుకోవడానికి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు. కరోనా ప్రభావం లేదు అని సుప్రీంకోర్టుని కూడా తప్పుదోవ పట్టించాలని చూసారు'' అని యనమల అన్నారు. 

''ఆఖరికి సీఎస్ ని బెదిరించి బలవంతంగా కరోనా లేదు అంటూ లేఖ రాయించారు. సుప్రీంకోర్టులో మొట్టికాయి పడ్డాక నిజాలు బయటపెట్టారు. మొన్నటి వరకూ లేని కేసులు ఉన్నట్టుండి ఎలా వచ్చాయి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనాని అరికట్టే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది'' అని ఆరోపించారు. 

''ఇక్కడ జరుగుతున్న పరిణామాల పై కేంద్రం దృష్టి పెట్టకపోతే ప్రజల ప్రాణాలు జగన్ గాల్లో కలిపేయడం ఖాయం'' అంటూ మాజీ మంత్రి సోషల్ మీడియా వేదికన యనమల కేంద్ర ప్రభుత్వ సాయాన్ని కోరారు.