Asianet News TeluguAsianet News Telugu

క్విడ్ ప్రోకో 2...విశాఖ తీరంలో రూ.300కోట్ల ప్రాజెక్టు జగన్ బినామీలకే: యనమల

రూ.120కోట్లతో టిడిపి ప్రభుత్వం అభివృద్ది చేసిన బేపార్క్ చేతులు మారడం వెనుక హస్తం ఎవరిది..? అని మాజీ మంత్రి యనమల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

Yanamala Ramakrishnudu Fires on CM Jagan over vizag bepark issue
Author
Guntur, First Published Oct 7, 2020, 12:46 PM IST


విశాఖపట్నం బేపార్క్ కూడా జగన్మోహన్ రెడ్డి బినామీల ఖాతాల్లో జమయ్యిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. కాకినాడ సెజ్ అరబిందో పేరుతో ఇప్పటికే జగన్ హస్తగతం కాగా తాజాగా బేపార్క్ కూడా హెటిరో పేరుతో కైవసానికి సిద్దమైందన్నారు. 

''టిడిపి హయాంలో విశాఖ రుషికొండ వద్ద అంతర్జాతీయ స్థాయిలో ఎకో టూరిజం ప్రాజెక్టు అభివృద్దికి శ్రీకారం చుట్టాం. కొండ మీద, కొండ కింద 36ఎకరాల్లో అంతర్జాతీయ పర్యాటక ప్రాజెక్టు అభివృద్దికి నాంది పలికాం. రూ.120కోట్లు ఖర్చుచేసి కొండపై మెడికల్ టూరిజం తరహాలో బే పార్క్ అభివృద్ది చేశాం. బినామీల ముసుగులో రూ300కోట్ల విలువైన ఈ భూమిని, ప్రాజెక్టును జగన్మోహన్ రెడ్డి హస్తగతం చేసుకోవడం ప్రజాద్రోహం'' అని మండిపడ్డారు. 

''రూ120కోట్లతో అభివృద్ది చేసిన బేపార్క్ చేతులు మారడం వెనుక హస్తం ఎవరిది..? బేపార్క్ లో మేజర్ వాటాలు ఎవరి ఒత్తిళ్ల మేరకు హెటిరో పరం అయ్యాయి..? కొండ మీద వాటాల కొనుగోళ్లకు ప్రతిఫలంగా కొండ కింద రూ225కోట్ల విలువైన 9ఎకరాల భూమి హెటిరో పరం..?  వాస్తవానికి ఇది కూడా బినామీ లావాదేవీనే. వీటన్నింటిపై కేంద్రం తక్షణమే స్పందించి అత్యున్నత స్థాయి దర్యాప్తు జరిపించాలి'' అని కోరారు. 

READ MORE  ఎన్డీఎలోకి వైఎస్ జగన్: క్లారిటీ ఇచ్చిన బిజెపి నేత

''టిడిపి టూరిజం ప్రాజెక్టులు అభివృద్ది జగన్ ప్రభుత్వం చేస్తే బినామీ ఆస్తుల అభివృద్ది చేస్తోంది. జగన్ పై సిబిఐ 12ఛార్జిషీట్లలో తొలి ఛార్జి షీట్ లో హెటిరో కూడా సహ నిందితుల జాబితాలో ఉంది. ఎ1 జగన్మోహన్ రెడ్డి, ఎ2 విజయసాయి రెడ్డి అయితే, ఎ4 గా హెటిరో, ఎ3 గా అరబిందో ఉన్నాయి'' అన్నారు. 

''జడ్చర్ల సెజ్ లో 75ఎకరాల భూములు హెటిరోకు కేటాయించినందుకు ప్రతిఫలంగా జగన్ కంపెనీలో రూ 19.50కోట్లు పెట్టుబడి పెట్టారని సిబిఐ తొలి ఛార్జ్ షీట్ లో పేర్కొనడం తెలిసిందే. హెటిరో డ్రగ్స్ లిమిటెడ్, హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్, హెటిరో హెల్త్ కేర్ లిమిటెడ్ పై, హెటిరో డైరెక్టర్ ఎం శ్రీనివాస రెడ్డిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడి) కేసుల గురించి విదితమే.  అప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో ఏ కంపెనీలకు మేళ్లు చేసి ప్రతిఫలంగా జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పొందారో, ఇప్పుడు అవే కంపెనీలకు మేళ్లు చేయడం గమనార్హం'' అన్నారు. 

''2004-09మధ్య జరిగింది క్విడ్ ప్రొకో -1 అయితే ఇప్పుడు జరుగుతోంది క్విడ్ ప్రొ కో- 2. అప్పటి కేసులలో తన సహనిందితులకే ఇప్పటి జగన్ పాలనలో మేళ్లు జరుగుతున్నాయి. 
అప్పటి సహనిందితులకే రాజకీయ పదవులు కట్టబెడుతూ అప్పటి సహనిందితులతోనే ఇప్పుడు బినామీ లావాదేవీలు జరుగుతున్నాయి. తొలి ఛార్జిషీట్ లో ఎ 3 గా ఉన్న అరబిందో కంపెనీకే కాకినాడ సెజ్, ఎ 4 గా ఉన్న హెటిరో కు విశాఖ బేపార్క్ కట్టబెట్టడం ఈ క్విడ్ ప్రొ కో-2లో భాగమే'' అన్నారు.

''అప్పుడు తండ్రి అధికారం అండతో, ఇప్పుడు ఏకంగా తన అధికారంలో వేలకోట్ల ప్రజాధనం బినామీల పరం చేయడం జగన్ అవినీతి పోకడలకు పరాకాష్ట. కేంద్రం తక్షణమే స్పందించి జగన్మోహన్ రెడ్డి బినామీ ట్రాన్సాక్షన్స్ పై అత్యున్నత స్థాయి దర్యాప్తు జరపాలి. కాకినాడ సెజ్, విశాఖ బేపార్క్ భూముల కొనుగోళ్ల లావాదేవీలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం. జగన్మోహన్ రెడ్డి క్విడ్ ప్రో కో-2 గుట్టు రట్టు చేస్తాం'' అని యనమల హెచ్చరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios