ఏపీకి ప్రత్యేక హోదా: న్యూఢిల్లీలో షర్మిల దీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ఇవాళ దీక్ష చేపట్టారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల శుక్రవారం నాడు ఏపీ భవన్ లో దీక్ష చేపట్టారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద షర్మిల, కాంగ్రెస్ నేతలు దీక్షకు దిగారు.
also read:ప్రత్యేక హోదా అంటే ఏమిటి: లాభాలెన్ని
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల మాట్లాడారు. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కొనసాగిస్తామన్నారు.
తిరుపతి సభలో కూడ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కొనసాగిస్తామని మోడీ హామీ ఇచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదని ఆమె మండిపడ్డారు. దుగ్గరాజపట్నం పోర్టు నిర్మిస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చలేదన్నారు.రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీని కూడ ఇస్తామన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు.విశాఖపట్టణం, చెన్నై పారిశ్రామిక కారిడార్ ను తీసుకువస్తామని హామీ ఇచ్చారన్నారు. ఐదేళ్లు కాదు, పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని మోడీ హామీ ఇచ్చారన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్క సీటును కూడ బీజేపీ గెలుచుకోకపోయినా రాష్ట్రాన్ని పాలిస్తుందని ఆమె ఆరోపించారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ బీజేపీకి గులాంగిరీ చేస్తున్నారని ఆమె విమర్శించారు.ప్రత్యేక హోదా విషయమై చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిల ప్రసంగం వీడియో క్లిప్ ను ఆమె ఈ సందర్భంగా విన్పించారు.
ప్రత్యేక హోదా విషయమై మాట మార్చిన చంద్రబాబు, జగన్ లు రాష్ట్ర ప్రజలను మోసం చేయలేదా అని ఆమె ప్రశ్నించారు. ప్రత్యేక హోదా సంజీవని ఈ నేతలే చెప్పారని చంద్రబాబు,జగన్ లపై షర్మిల విమర్శలు చేశారు. ప్రత్యేక హోదాతో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో పరిశ్రమలు ఏర్పాటైన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఏపీకి చెందిన 25 మంది ఎంపీలు బీజేపీకి గులాంగిరీ చేస్తున్నారని షర్మిల విమర్శించారు. ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా వచ్చి ఉండేదిగా ఆని ఆమె పేర్కొన్నారు.