వైసిపి ఫిరాయింపు ఎమ్మెల్యెేలు అనర్హత నుంచి ప్రతిసారి తప్పించుకుంటున్నారు. ఈ కౌన్సిల్ ఎన్నికల్లోనయినా ‘విప్’ కు తగులుకుంటారా
ఏపి శాసన మండలికి జరుగుతున్న ఎన్నికల సందర్భంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటి? ఈ సారి కూడా వైసిసి విప్ కు దొరక్కుండా టిడిపి వారిని కాపాడుతుందా?
జగన్ నేతృత్వంలోని వైసిపి నుంచి 21 మంది ఎమ్మెల్యేలు తెలుగు దేశం పార్టీలోకి దూకారు. వాళ్లని పార్టీ నుంచి బహిష్కరించినా, వాళ్ల మీద అసెంబ్లీ అనర్హత వేటు పడలేదు. ఈ విషయం స్పీకర్ దగ్గిర నానుతూ వస్తున్నది. కోర్టు దాకా వెళ్లింది. లెక్క ప్రకారం ఇపుడు కౌన్సిల్ ఎన్నికలలో వారంతా వైసిసి ఎమ్మెల్యలుగా ఉంటూ తెలుగు దేశం అభ్యర్థికి వోటు వేస్తారు.
చాలా కాలంగా వీరు జగన్ కు చిక్కకుండా తిరుగుతున్నారు. ఈ ఫిరాయింపుదారులను డిస్‌క్వాలిఫై చేయించాలని వైసిపి శత విధాల ప్రయత్నిస్తుంటే, అనర్హత వేటు పడకుండా టిడిపి వారిని కాపాడుతూ ఉంది. గత ఏడాది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వారిని అనర్హులనుచేయాలనే లక్ష్యంతో చంద్రబాబు మంత్రి మండలి పైనా, స్పీకర్ కోడెల పైనా వైసిపి వెంటవెంటనే అవిశ్వాస తీర్మానాలు ప్రతిపాదించింది. అధికారపక్షం తెలివిగా ఫిరాయింపుదార్లను ఆ గండం నుంచి తప్పించింది.
గతేడాదే, రాజ్యసభ ఎన్నికల సమయం లో అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటీ లేక పోవడంతో పిరాయింపు దారుల అనర్హత చర్చకు రాలేదు.ఇపుడు మళ్లీ కౌన్సిల్ ఓట్లు వచ్చాయి. విప్ జారీ చేసి వారు విప్ ధిక్కరిస్తే, విప్ ధిక్కారం పేరుతో వారిని డిస్ క్వాలిఫై చేయించవచ్చు.
అసెంబ్లీ కోటాలో ఎమ్మెల్సీ గా నెగ్గాలంటే 25.6 ఓట్లు కావాలి. శాసనసభలో టిడిపి, వైసిపి బలాబలాల ప్రకారం టిడిపికి ఐదు, వైసిపికి రెండు స్థానాలు దక్కాలి. అయితే, వైసిపి కి ఉన్న 67 మందిలో 21 మంది టిడిపిలోకి ఫిరాయించడంతో ప్రతిపక్ష పార్టీకి మిగిలిన బలం 46మాత్రమే. దీనితో జగన్ కు ఒక ఎమ్మెల్సీ మాత్రమే వస్తాడు. ఒకరికి 26 ఓట్లను కేటాయిస్తే ఇంకా 20 ఓట్లు మిగులుతాయి. రెండో ఎమ్మెల్సీ తెచ్చు కోవాలంటే వైసిపికి ఇంకా ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు కావాలి. ప్రతిపక్ష నేత ఈ ఇరవై ఓట్లలో కొన్నింటిని పొగొట్టుకుంటాడా, లేక మరొక ఆరు తెచ్చుకుంటాడా చూడాలి.
రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు, ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో ఈ 21 మంది శాసన సభ్యుల అనర్హత చర్చనీయాంశమయింది.
కౌన్సిల్ లో ప్రతిభా భారతి (టిడిపి), చెంగలరాయుడు (కాంగ్రెస్), సతీష్‌రెడ్డి (టిడిపి), మహ్మద్ జానీ (కాంగ్రెస్), సి రామచంద్రయ్య (కాంగ్రెస్), ఎం సుధాకర్‌బాబు (కాంగ్రెస్), చంద్రశేఖర్ (సిపిఐ)ల పదవీకాలం ముగుస్తుండటంతో 7 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. చెంగలరాయుడు, జానీ ఇటీవల కాంగ్రెస్ నుంచి టిడిపిలోకి వచ్చారు.
పార్టీలకు విప్ జారీ చేసే అధికా రం ఉన్నందున వైసిపి తమ నుంచి ఫిరాయించిన వారికి కూడా విప్ జారీ చేస్తే తప్ప నిసరిగా వారందరూ వైసిపి అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉంటుంది. అలా కాకుండా విప్‌ను ధిక్కరిస్తే అనర్హత వేటు పడుతుంది. ఈ ఎన్నిక అసక్తిగా మారేందుకు ఇదే కారణం.
