Asianet News TeluguAsianet News Telugu

క్యాష్ లెస్ లావాదేవీలు సాధ్యమేనా?

ప్రపంచంలోనే బాగా అభివృద్ధి చెంది, 100 శాతం అక్షరాస్యత సాధించిన స్వీడెన్, అమెరికా, జర్మనీ, జపాన్ లాంటి దేశాల్లోనే సాధ్యం కాలేదు. అటువంటిది కేవలం 64 శాతం మాత్రమే అక్షరాస్యత ఉన్న విశాఖపట్నం సిటీలో ఎలా సాధ్యమవుతుంది?

would total cash less vizag become a reality

నారా లోకేష్ చెబుతున్నట్లు విశాఖపట్నం సిటిలో నూరుశాతం క్యాష్ లెస్ లావాదేవీలు సాధ్యమేనా? క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు చూస్తుంటే నూరుశాతం సాధ్యం కాదనే అనిపిస్తోంది. ఎందుకంటే, ప్రపంచంలోనే బాగా అభివృద్ధి చెంది, 100 శాతం అక్షరాస్యత సాధించిన స్వీడెన్, అమెరికా, జర్మనీ, జపాన్ లాంటి దేశాల్లోనే సాధ్యం కాలేదు. అటువంటిది కేవలం 64 శాతం మాత్రమే అక్షరాస్యత ఉన్న విశాఖపట్నం సిటీలో ఎలా సాధ్యమవుతుంది?

విశాఖపట్నం సిటిని 10 నెలల్లో క్యాష్ లెస్ సిటీగా మార్చేస్తున్నట్లు లోకేష్ ఏదో గొప్పకోసం చేసిన ప్రకటనే తప్ప మరేం కాదు.  పైగా తానేదో స్మార్ట్ సిటీగా తయారు చేయటానికి కష్టపడుతున్నట్లు ఇపుడు బిల్డప్ ఇస్తున్నారు లోకేష్. విశాఖపట్నాన్ని స్మార్ట్ సిటీగా మార్చేందుకు కేంద్రప్రభుత్వం మూడేళ్ళుగా కృషి చేస్తోంది.

స్మార్ట్ సిటీ తయారీలో భాగంగానే గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (బివిఎంసి)పరిధిలో చాలా ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతోంది. అందులో భాగమే చాలామందికి బ్యాంక్ ఖాతాలు తెరవటం, ఆధార్ కార్డుల పంపిణీ, ఓటర్ల జాబితాలో సవరణలు లాంటివన్నీ జరుగుతున్నాయి. సరే, కష్టమెవరిదైనా, షోకులు ఎవరు చేసుకున్నా 100 శాతం క్యాష్ లెస్ లావాదేవీలైతే సాధ్యం కాదన్న విషయం అందరికీ తెలిసిందే.

ఇప్పటికే జివిఎంసి పరిధిలో ప్రతిరోజు 40 శాతం క్యాష్ లెస్ లావాదేవీలు నమోదవుతున్నాయి. కూరగాయల కొట్లు, రైతుబజార్లు, పాల వ్యాపారులు, కిరాణా కొట్లు ఇలా..చాలా వరకూ నగదు రహిత లావాదేవీలకు అలవాటు పడుతున్నారు. పెద్ద నోట్ల రద్దు జరగకపోతే నగదు రహిత లావాదేవీలు మరింత ఊపందుకునేదే.

సరే ఆ విషయాన్ని పక్కనబెడితే జివిఎంసి పరిధిలో సుమారు 20 శాతం మందికి ఇప్పటికీ ఆధార్ కార్డులు లేవు. బ్యాంకు ఖాతాలు కూడా లేవు. ఇందుకు ప్రధాన కారణం వలసలే.

జివిఎంసి పరిధిలో రోజుకు కొన్ని లక్షల మంది ఉపాధికోసం జివిఎంసి పరిధిలోకి వస్తుంటారు, వెళిపోతుంటారు. కాబట్టి వారందరకీ బ్యాంకు ఖాతాలు, ఆధార్ కార్డులు లేవు. పైగా దినసరి కూలీలు, ఏరోజుకారోజు ఉపాధాని వెతుక్కునే వారికి సాయంత్రమయ్యేసరికి చేతిలో డబ్బు పడాల్సిందే. కాబట్టి ఏ విధంగా చూసినా లోకేష్ చెబుతున్నట్లు 100 శాతం క్యాష్ లెస్ లావాదేవీలు సాధ్యం కాదు.

Follow Us:
Download App:
  • android
  • ios