చంద్రబాబునాయుడు ప్రభుత్వం వింత పోకడలు పోతోంది. పెట్టుబడుల కోసమంటూ దావోస్ లో ఓ ప్రచార రథం (బస్సు)ను తిప్పుతోంది. అంటే ఆ బస్సును చూడగానే ప్రపంచంలోని పెట్టుబడిదారులందరూ పోలోమంటూ పెట్టుబడులు పెట్టటానికి ఏపికి పరిగెట్టుకు వచ్చేస్తారని అనుకుంటోంది ప్రభుత్వం. ప్రతీ ఏడాది దావోస్ ప్రపంచ ఆర్దిక సదస్సులో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుండి పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వాల్లో కీలక వ్యక్తులు ఇలా.. అందరూ పాల్గొంటారు.

ఈ సదస్సుకు చంద్రబాబు కూడా నాలుగేళ్ళుగా క్రమం తప్పకుండా హాజరవుతూనే ఉన్నారు. పోయినసారి హాజరైనపుడు ఎంత వివాదం రేగిందో అందరకీ తెలిసిందే. ఎందుకంటే, దావోస్ లో పాల్గొనేందుకు ఆహ్వానం రావటమంటే మాటలు కాదు. అటువంటిది చంద్రబాబుకు ఎందుకు క్రమం తప్పకుండా వస్తోందో ఎవరికీ అర్ధం కాలేదు. ఆరా తీస్తే ఆహ్వానాన్ని చంద్రబాబు కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నట్లు బయటపడింది. అందుకే పోయిన సారి అంత రాద్దాంతమైంది.

సరే, ఇక ప్రస్తుత విషయానికి వస్తే, ఈసారి జరగబోయే సదస్సులో తండ్రి, కొడుకులు ఇద్దరూ హాజరవుతున్నారు. అందుకని ముందుగా పెట్టుబడుల గురించి ప్రచారం చేయటానికి ఓ ప్రచార రథాన్ని ఏర్పాటు చేశారు. ఇంతకీ ఆ ప్రచారరథం ఏంటంటే, దావోస్ లో తిరిగే సాధారణ ప్యాసింజర్ బస్సు. దానికే ప్రభుత్వం ప్రచార రథమని ఘనంగా చెప్పుకుంటోంది. ఇంతకీ ఆ ప్రచార రథంలో ఏం జరుగుతోంది? అంటే ఏమీ జరగటం లేదు. ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు దిగేవాళ్ళు దిగుతున్నారంతే.

బస్సుకు మన దగ్గర అడ్వర్టైజ్ మెంట్ పోస్టర్లు అంటించినట్లే అక్కడా అంటించారు. కాకపోతే ప్రభుత్వానికి సంబంధించిన పోస్టర్లు అంటించారు. పెట్టుబడులకు ఫ్రెండ్లీ స్టేట్ అని, పెట్టుబడులకు స్వర్గధామమని బస్సుకు రెండు వైపులా పెద్ద పోస్టర్లు అంటించారంతే. బస్సు మీద పోస్టర్లు అంటించి దావోస్ లో తిప్పేస్తే పెట్టుబడులు వచ్చేస్తాయని ప్రభుత్వం ఎలా అనుకున్నదో ఏమో?