అఖిల మీదే బాధ్యత ఫిక్స్ చేస్తారా ?

First Published 21, Nov 2017, 1:50 PM IST
would TDP government make minister akhila scape goat for boat tragedy
Highlights
  • ‘ప్రమాద దుర్ఘటనకు మంత్రే బాధ్యత వహించాల్సి ఉంటుంది’.
  • .‘గతంలో శాఖాపరమైన వైఫల్యాలకు మంత్రులు వెంటనే రాజీనామాలు చేసేవారు’..
  • ఇవి ప్రమాదానికి సంబంధించి మంత్రి అఖిలప్రియను ఉద్దేశించి చంద్రబాబునాయుడు అన్న మాటలు.

‘ప్రమాద దుర్ఘటనకు మంత్రే బాధ్యత వహించాల్సి ఉంటుంది’..‘గతంలో శాఖాపరమైన వైఫల్యాలకు మంత్రులు వెంటనే రాజీనామాలు చేసేవారు’..ఇవి ప్రమాదానికి సంబంధించి మంత్రి అఖిలప్రియను ఉద్దేశించి చంద్రబాబునాయుడు అన్న మాటలు.  కృష్ణానదిలో ఇటీవలే జరిగిన బోటు ప్రమాదంలో 22 మంది మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రమాదం తాలూకు ప్రకంపనలు ప్రభుత్వాన్ని ఇంకా వదలినట్లు లేదు. సహచర మంత్రులు, ఉన్నతాధికారుల సమక్షంలోనే తనపై చంద్రబాబు వ్యాఖ్యలు చేయటంతో మంత్రి అఖిలప్రియ ఒక్కసారిగా ఖంగుతిన్నారు.

చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో మంత్రి రాజీనామా పై ప్రభుత్వంలోనే కాకుండా పార్టీలో కూడా పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఒకవైపు బోటు ప్రమాదంపై విచారణ జరుగుతోంది. ప్రమాద బాధిత కుటుంబాలకు న్యాయం చేయకుండా ప్రమాదానికి బాధ్యత ఎవరిదనే విషయంపై చర్చ జరుగుతుండటం గమనార్హం. ప్రమాదానికి గురైన బోటు వెనుక ఇద్దరు మంత్రులతో పాటు ఉన్నతాధికారుల హస్తం కూడా ఉన్నట్లు ఆరోపణలు వినబడుతూనే ఉన్నాయి. ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు బాధ్యత కూడా ఉందంటూ ఆరోపణలు వినిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

గడచిన మూడు సంవత్సరాలుగా పర్యాటక శాఖను చంద్రబాబే పర్యవేక్షిస్తున్నారు. నదిలో తిరుగుతున్న బోట్లన్నింటికీ లైసెన్సులు ఇచ్చింది చంద్రబాబు హయాంలోనే అలాగే, అనుమతి లేని బోట్లు కూడా చాలా కాలంగానే తిరుగుతున్నాయి. అందుకు బాధ్యత తీసుకోవాల్సింది ముఖ్యమంత్రే. తన వైపల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే మంత్రి అఖిలపై చంద్రబాబు నెపం వేస్తున్నారనే ప్రచారం మొదలైంది. గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది మరణిస్తే ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు.

ప్రస్తుత విషయానికి వస్తే బోటు ప్రమాదానికి బాధ్యత వహించాల్సింది ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమానే అంటూ అఖిలప్రియ వర్గం డిమాండ్ చేస్తుండగా, పర్యాటక శాఖ మంత్రి అఖిలనే బాధ్యురాలంటూ దేవినేని వర్గం ఎదురుదాడి చేస్తున్నది. చూడబోతే బాధ్యత మీదంటే మీదంటూ వాదులుకోవటం ద్వారా అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్లాన్ ఏమైనా చంద్రబాబు మనసులో ఉందా అన్న అనుమానాలు కూడా మొదలైంది.

 

loader