జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లో ఆర్భాటమే తప్ప విషయం ఉన్నట్లు ఇప్పటికీ స్పష్టం కాలేదు. సినిమాల్లో సక్సెస్ అయ్యుండొచ్చు. పొలిటికల్ గా మాత్రం ఫెయిల్ అనే చెప్పాలి. ఎందుకంటే, జనసేన పార్టీని పెట్టి ఈనెల 14వ తేదీకి నాలుగేళ్ళు పూర్తవుతున్నా రాజకీయాల్లో తన స్టాండ్ ఏంటన్న విషయంపై పవన్లో ఇప్పటికీ క్లారిటీ లేదు.

తనలో క్లారిటీ లేకపోవటంతో మొత్తం రాష్ట్ర రాజకీయాలే అయోమయంలో ఉన్నాయని చెప్పవచ్చు. రాష్ట్రం క్లిష్టపరిస్ధితుల్లో ఉన్నా ఇప్పటి వరకూ ఏ విషయంపైన కూడా స్పష్టమైన అవగాహన లేకుండా రాజకీయాలు చేస్తున్నది బహుశా ఒక్క పవన్ మాత్రమేనేమో?

ఒకసారి ఎన్నికల్లో పోటీ చేస్తానంటారు. ఇంకోసారి అధికారం అందుకోవటం తన లక్ష్యం కాదంటారు. తప్పు చేసిన వారెవరైనా తాను చొక్కా పట్టుకుని నిలదీస్తానంటారు. మూడున్నరేళ్ళుగా చంద్రబాబునాయుడును ఒక్క అంశం మీద కూడా గట్టిగా ప్రశ్నించిన పాపాన పోలేదు. ప్రత్యేకహోదా సాధనలో చంద్రబాబు విఫలమైనా, రాష్ట్ర విభజన చట్టాన్ని అమలు చేయకుండా ప్రధానమంత్రి నరేంద్రమోడి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా నేరుగా నిలదీసింది లేదు.

ఇక రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయింది. అన్నీ వ్యవస్ధలను టిడిపి దెబ్బతీస్తోందని జనాలు మొత్తుకుంటున్నా ఒక్కసారి కూడా మాట్లాడలేదు. 22 మంది వైసిపి ఎంఎల్ఏలను ప్రలోభాలు పెట్టి కొనుగోలుచేసి టిడిపిలోకి లాక్కున్నా ఏనాడూ తప్పని చెప్పలేదు. ప్రభుత్వ అధికారులను టిడిపి నేతలు ఎక్కడపడితే అక్కడ దాడులు చేసి కొడుతున్నా పట్టించుకోలేదు.

పైవన్నీ ఒక ఎత్తైతే, రాజకీయంగా ఏ విషయంలో కూడా స్పష్టత లేకపోవటం విచిత్రమే. ఒకవైపేమో 2019 ఎన్నికలు తరుముకుని వచ్చేస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందో స్పష్టత లేదు. బిజెపి-టిడిపిల పరిస్ధితి అయోమయంలో ఉంది.

ఈ పరిస్ధితుల్లో కూడా వచ్చే ఎన్నికల్లో తాను ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటానో తనకే తెలీదని చెప్పటమే విచిత్రం. ఏపిలో చంద్రబాబు పాలన బ్రహ్మాండమంటారు. తెలంగాణాలో కెసిఆర్ చక్కగా పరిపాలిస్తున్నట్లు చెబుతారు. అధికారంలో ఉన్న పార్టీలు బాగా పరిపాలిస్తుంటే మరి జనసేన అవసరం ఏముంది?  ఇప్పటి వరకూ పవన్ ఇచ్చిన ఒకే ఒక క్లారిటీ ఏంటంటే? జనసేన రెండు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తుందని.

ఒక్కోసారి ఒక్కో స్టేట్మెంట్ ఇస్తూ జనాల్లోనూ, రాజకీయ పార్టీల్లోనూ అయోమయం సృష్టిస్తున్న పవన్, కేవలం చంద్రబాబుకు మద్దతుగానే రాజకీయాలు చేస్తున్నారనే ముద్రమాత్రం పడిపోయింది. నాలుగేళ్ళ పవన్ రాజకీయంలో కేవలం ఆర్భాటమే తప్ప విషయం ఉన్నట్లు ఎవరికీ కనబడలేదు. కనీసం 14వ తేదీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజైనా క్లారిటీతో మాట్లాడుతారేమో చూడాలి?