అతనికన్నా.. ఆమె జీతం రెట్టింపు.. అదే శాపంగా మారింది

First Published 15, Jun 2018, 10:52 AM IST
women sucide in vizag over the torture of her husband
Highlights

భార్య ఎక్కువ సంపాదిస్తోందని వేధించిన భర్త


తనకన్నా తన భార్య ఎక్కువ సంపాదన ఆర్జించడాన్ని ఆ భర్త జీర్ణించుకోలేకపోయాడు. దీంతో.. ఏదో ఒక కారణంతో ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. అతను పెట్టే టార్చర్ తట్టుకోలేకపోయింది. అంతేకాకుండా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పిల్లలను కూడా భర్త తనకు కాకుండా చేశాడు. దీంతో.. తట్టుకోలేక ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... విశాఖ చినవాల్తేరు కిర్లంపూడి ప్రిన్స్‌ అపార్టుమెంట్‌లో పీతల అప్పారావు నివాసముంటున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు రెండో కుమార్తె వాణి (35)ని జడ్పీ సమీపంలోని కృష్ణానగర్‌కు చెందిన పసుపులేటి గంగాధర్‌కు ఇచ్చి 2011లో వివాహం చేశారు.
 
ఇద్దరూ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా స్థిరపడ్డారు. వాణికి రూ.7.8 లక్షలు జీతం కాగా గంగాధర్‌ జీతం రూ.నాలుగు లక్షలు. వీరికి ఆరేళ్లు, మూడేళ్ల వయస్సు ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. మనస్పర్థలు రావడంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో నగరానికి వచ్చేశారు. వాణి ఇద్దరు పిల్లలతో పుట్టింట్లో ఉంటుండగా, గంగాధర్‌ తన తల్లిదండ్రులతో ఉంటున్నాడు. 

ఇదిలాఉండగా గంగాధర్‌ పిల్లలను తన వద్దకు రప్పించుకున్నాడు. ఆ సమయంలో వాణి.. తాను కూడా వస్తానని అతనితో చెప్పగా, పిల్లల్ని మాత్రమే తీసుకురమ్మన్నాడని చెప్పడంతో ఆమె ఉండిపోయింది. బుధవారం ఎప్పటిలాగే నిద్రపోయింది. ఉదయం బయటకు రాకపోవడంతో అనుమానంతో తలుపులు బద్ధలు కొట్టిచూసేసరికి వాణి అచేతనం గా ఉంది. 

గంగాధర్‌ వేధింపుల వల్లే వాణి ఆత్మహత్య చేసుకుందని ఆమె సోదరి సుహాసిని ఆరోపించారు.  సంపాదన విషయంలో గంగాధర్.. వాణిని తీవ్రంగా వేధించేవాడని విచారణలో తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు  ఎస్‌ఐ ప్రసాద్‌ తెలిపారు. 

loader