నగలన్నీ ప్రియుడితో కలిసి తానే కాజేసి.. తర్వాత దొంగలు బంగారం ఎత్తుకుపోయారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చివరకు వేసిన పథకం బెడిసి కొట్టి పోలీసులకు చిక్కింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పాకాలలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మే 11న పాకాల పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోని రైల్వేకాలనీ శ్రీరామాలయానికి వచ్చి వెళుతుండగా గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కళ్లలో కారం కొట్టి తన వద్ద ఉన్న నగలను దోచుకెళ్లారంటూ గాంధీనగర్‌కు చెందిన వివాహిత స్వాతిప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీస్‌ స్టేషన్‌కు సమీపంలోనే ఘటన జరగడంతో తక్షణమే స్పందించిన పోలీసులు ఘటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విచారణ ప్రారంభించారు. దీంతో దిమ్మతిరిగే విషయాలు బయటపడ్డాయి...

స్వాతిప్రియ తమ తల్లిదండ్రులకు రెండో సంతానం. 2015లో గాంధీనగర్‌కే చెందిన దిలీప్‌కుమార్‌తో ఆమెకు వివాహమైంది. నిందితురాలి అక్కకు అయిదేళ్ల కిందట వివాహం జరిగినా... అనంతరం భర్తతో పొసగక తిరిగొచ్చేసింది. మూడేళ్లుగా తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఆమెకు ఇన్‌స్ట్రాగ్రామ్‌ ద్వారా తూర్పుగోదావరి జిల్లా కరప మండలం, నడకుదురుకు చెందిన పవన్‌కుమార్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అతడు ఓ ప్రైవేటు సంస్థలో సేల్స్‌ విభాగంలో ఉద్యోగం చేస్తున్నట్లు, అతడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తల్లిదండ్రులకు కూడా తెలియజేసింది. 

ఆమె తల్లిదండ్రులు సైతం అడ్డు చెప్పలేదు. దీంతో తిరుపతిలోని అర్బన్‌హట్‌ వద్ద వారు కలుసుకునేవారు. ఈ విషయం చెల్లెలు స్వాతిప్రియకు సైతం తెలిసింది. బావా అంటూ వరస కలిపి తను కూడా అతనితో పరిచయం పెంచుకుంది. వాట్సాప్‌, ఫోన్‌ ద్వారా మాటలు కలిశాయి. స్వాతిప్రియ, పవన్‌కుమార్‌ ఒకరంటే ఒకరు ఇష్టం పెంచుకున్నారు. విషయం ఇంటి వద్ద తెలిసి మందలించారు. అదేం లేదంటూ బుకాయిస్తూనే ఆమె పవన్‌కుమార్‌కు మరింత దగ్గరైంది.

ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం అంత బాగాలేదనీ, చేతిలో డబ్బులుంటే మరింత పెద్ద ఉద్యోగం సంపాదించుకోవచ్చని పవన్‌కుమార్‌ నిందితురాలు స్వాతిప్రియకు చెప్పాడు. దీంతో అతనికి సహకరించాలని ఆమె నిర్ణయించుకుంది. ఇద్దరు కలిసి కుట్ర పన్నారు. తమ తల్లిదండ్రులు కొనిచ్చిన చంద్రహారానికి బీమా సైతం చేయించడం వల్ల దొంగలు తీసుకెళ్లినట్లు కేసు పెడితే బంగారం మళ్లీ పొందవచ్చని ప్రణాళిక వేసుకున్నారు.

 అనుకున్న ప్లాన్‌ ప్రకారం శుక్రవారం రోజున అమ్మవారి మెడలో అలంకరించి తరువాత తాను ధరించాలని నమ్మబలికి పూజ చేయించింది. ఆ నగలతోనే రామాలయానికి వెళుతున్నట్లు చెప్పి నేండ్రగుంటకు వెళ్లి నగలన్నీ పవన్‌కుమార్‌ పంపిన అతని స్నేహితుడికి అప్పగించింది. వెనక్కు తిరిగొచ్చి ఎవరో ఆగంతకులు కళ్లలో కారం కొట్టి నగలు పట్టుకెళ్లారని కట్టు కథ అల్లి ఫిర్యాదు చేసింది. 

పోలీసులు ఫోన్‌ సంభాషణ, ఇతర సాంకేతికాంశాల సహాయంతో కేసును ఛేదించారు. తరచూ ఫోన్‌లో మాట్లాడిన పవన్‌కుమారే ఆ నగలను నడకుదురు సిండికేట్‌ బ్యాంకులో పెట్టి రూ.3.13 లక్షల రుణం పొందినట్లు గుర్తించారు. తప్పుడు ఫిర్యాదు చేయడం, పోలీసులను నమ్మించేందుకు ప్రయత్నించడం, కుట్ర, బీమా సంస్థను మోసం చేసేందుకు ప్రయత్నించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని నిందితురాలు స్వాతిప్రియపై కేసు నమోదు చేశారు. నగలను కాజేసిన పవన్‌కుమార్‌ను రెండో నిందితుడిగా పేర్కొని ఆయన్ను అరెస్టు చేశారు.