భార్యభర్తల మధ్య గొడవ.. బిడ్డల ప్రాణాల మీదకు తెచ్చింది. భర్త తనతో తరచూ గొడవ పడుతున్నాడని ఓ మహిళ తన ఇద్దరు కన్న బిడ్డల గొంతు కోసి.. తాను కూడా ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆట్రపల్లె గ్రామానికి చెందిన ఆనంద్ కు శాంతిపురం మండలానికి చెందిన మీనాక్షితో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మనోజ్(7), మధుమిత(5) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.  కొంత కాలంగా భర్త ఆనంద్, భార్య మీనాక్షి మధ్య ఆర్థిక వ్యవహారాల కారణంగా కలహాలు ఏర్పడ్డాయి. ఈ నేపధ్యంలో శుక్రవారం ఉదయం  భర్తతో ఆమె గొడవపడింది.  


తీవ్ర  మనస్థాపానికి గురైంది. ఇంట్లో ఉన్న వంట కత్తితో ఇద్దరు బిడ్డల గొంతు, చేయి కోసింది. అనంతరం ఆమె గొంతు, చేయి కోసుకుంది. తీవ్ర రక్త స్రావంతో కొట్టుమిట్టాడుతున్న తల్లి,బిడ్డలను గ్రామస్తులు వి.కోట సీహెచ్‌సీకి తరంలించారు.అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 ద్వారా  కుప్పం పీఈఎస్‌ అస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మహేష్‌బాబు తెలిపారు. తల్లి, పిల్లలకు  ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు.